Telugu Gateway
Politics

భోగాపురం విమానాశ్రయం గోల్ మాల్ పై మోడీకి ఫిర్యాదు

భోగాపురం విమానాశ్రయం గోల్ మాల్ పై మోడీకి ఫిర్యాదు
X

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం టెండర్ల రద్దు వ్యవహారం కొత్త మలుపు తిరిగింది. ఈ అంశంపై వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రధాని మోడీకి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆయన మంగళవారం నాడు ప్రధానికి లేఖ రాశారు. విభజన అనంతరం ఏపీలో గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం ఏర్పాటుకు కేంద్రం నుంచి అన్ని అనుమతులు వచ్చి..టెండర్లు పిలిచిన తర్వాత ఆకస్మాత్తుగా టెండర్లు రద్దు చేయటం అనుమానాలకు ఆస్కారమిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎయిర్ పోర్ట్స్ ఆథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) ఈ టెండర్ లో పాల్గొని ప్రభుత్వానికి అత్యధిక రెవెన్యూ ఇవ్వటానికి ముందు వస్తే ...కుంటిసాకులు చెప్పి టెండర్ రద్దు చేయటం వెనక మతలబు ఏమి ఉందో తెల్చాల్సిన అవసరం ఉందని అన్నారు.

బిడ్ దాఖలు చేసిన వాటిలో ఒకటి ప్రైవేట్ సంస్థ, మరొకటి ఏఏఐ ఉందని అన్నారు. కేంద్రంలో పౌరవిమానయాన శాఖ మంత్రిగా ఉన్న అశోక్ గజపతిరాజు తన సొంత శాఖకు చెందిన సంస్థకు అన్యాయం జరుగుతున్నా మౌనంగా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోందని తన లేఖలో పేర్కొన్నారు. బొత్స విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ లేఖ విషయాలను తెలిపారు. అదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. చంద్రబాబులాంటి దుర్భుద్ధి కలిగిన వ్యక్తిని ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో ఎక్కడా చూడలేదని బొత్స విమర్శించారు.

Next Story
Share it