Telugu Gateway
Politics

అసదుద్దీన్ పై బూటు దాడి

అసదుద్దీన్ పై బూటు దాడి
X

ముంబయ్ లో ఊహించని ఘటన. ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీని షాక్ కు గురిచేసింది. ఆయన ముంబయ్ లో చేదు అనుభవం ఎదురైంది. దక్షిణ ముంబైలోని నాగ్‌పదలో మంగళవారం రాత్రి జరిగిన సభలో ఆయన ప్రసంగిస్తుండగా ఓ గుర్తుతెలియని వ్యక్తి ఒవైసీపై బూటు విసిరాడు. అది ఒవైసీకి తగల్లేదు. ఘటనకు నిర్ఘాంతపోయిన ఆయన వెంటనే తేరుకుని తన ప్రసంగాన్ని కొనసాగించారు. రాత్రి 9.45 గంటల సమయంలో ట్రిపుల్‌ తలాక్‌ గురించి ఒవైసీ ప్రసంగిస్తుండగా ఈ సంఘటన జరిగింది. ‘ప్రజాస్వామిక హక్కుల కోసం నా ప్రాణాలైనా అర్పిస్తాను. ట్రిపుల్‌ తలాక్‌ను సాధారణ ప్రజలు, ముఖ్యంగా ముస్లింలు అంగీకరించడం లేదన్న వాస్తవాన్ని వీళ్లు గుర్తించలేరు.

వీళ్లంతా అసహనపరులు’ అని ఒవైసీ ఆరోపించారు. మహాత్మాగాంధీ, గోవింద్‌ పన్సారే, నరేంద్ర దభోల్కర్‌లను చంపేసిన హంతకుల భావజాలాన్నే తనపై బూటు దాడి చేసిన వారు అనుసరిస్తున్నారని, విద్వేష భావజాలం కారణంగానే ఇలాంటి దాడులు జరుగుతున్నాయని అన్నారు. ఇలాంటి వ్యక్తులు రోజురోజుకు బలం పుంజుకుంటున్నారని ఒవైసీ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దాడులు నిజాలు మాట్లాడకుండా తనను అడ్డుకోలేవని అన్నారు.

Next Story
Share it