Telugu Gateway
Andhra Pradesh

ప్రపంచ శ్రేణి ఏపీ అసెంబ్లీలో ‘టీ కష్టాలు’

ప్రపంచ శ్రేణి ఏపీ అసెంబ్లీలో ‘టీ కష్టాలు’
X

అదేంటి?.అసెంబ్లీ ఏమిటి? టీ కష్టాలు ఏమిటి అంటారా?. ఆంధ్రప్రదేశ్ లో ఏ కట్టడం కట్టినా సరే అది ప్రపంచ శ్రేణి అని చెప్పటం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, పురపాలక శాఖ మంత్రి నారాయణకి అలవాటు. కొత్తగా కట్టిన అసెంబ్లీ, సచివాలయాల భవనాల శ్లాబుల్లో నుంచి నీరు గారినా వారు ఏ మాత్రం రాజీపడరు. పైగా అత్యంత రికార్డు సమయంలో కట్టామని గొప్పలు చెప్పుకోవటం అయితే ఇక లెక్కేలేదు. ఏపీ అసెంబ్లీలో వందలాది మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇందులో శాశ్వత ఉద్యోగులతోపాటు..భారీ ఎత్తున కాంట్రాక్ట్..ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. అయితే ఇంత పెద్ద అసెంబ్లీలో సర్కారు కనీసం ఓ చిన్న క్యాంటీన్ కూడా ఏర్పాటు చేయలేదు. పోనీ అది ఏమైనా నగరం మధ్యలో ఉంటుందా?. అలా వెళ్లి ఇలా టీ తాగిరావటానికి అంటే అదీ లేదు. టీ తాగాలన్నా..టిఫిన్ చేయాలన్నా సచివాలయంలోని క్యాంటిన్ కు వెళ్లాల్సిందే. లేదంటే కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే కానీ హోటల్ ఉండదు.

అసలు అసెంబ్లీలో క్యాంటీన్ లేకపోవటం ఓ సమస్య అయితే...అసెంబ్లీ ఉన్నతాధికారి ఒకరు తాజాగా జారీ చేసిన ఆదేశాలు అసెంబ్లీ ఉద్యోగుల్లో కలకలం రేపుతున్నాయి. అసెంబ్లీ నుంచి సచివాలయంలోకి ప్రవేశించే గేటు మధ్యాహ్నం సమయంలో తప్ప..అన్నివేళలా మూసేసి ఉంచాలని కొత్త కార్యదర్శి ఆదేశించటంతో అసెంబ్లీ ఉద్యోగులు నానా కష్టాలు పడుతున్నారు. అయితే కొంత మంది మాత్రం నిత్యం టీ పేరుతో అటూ ఇటూ తిరుగుతున్నారనే విమర్శలూ ఉన్నాయి. అయినా సరే కోట్లాది రూపాయలు వెచ్చింది..అత్యాధునిక సౌకర్యాలతో భవనాలు కట్టించామని మంత్రి నారాయణ గొప్పలు చెప్పుకున్నారు....అందులో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సరైన టాయ్ లెట్ సౌకర్యం కల్పించకపోవటం ఒకెత్తు అయితే..కనీసం క్యాంటీన్ ఏర్పాటు చేయలేకపోవటంపై ఉద్యోగులు మండిపడుతున్నారు.

Next Story
Share it