Telugu Gateway
Andhra Pradesh

‘అమరావతి’ వైపు చూడని సింగపూర్ సంస్థలు!

‘అమరావతి’ వైపు చూడని సింగపూర్ సంస్థలు!
X

ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని ‘అమరావతి’ పేరు ఖరారు అయినప్పటి నుంచి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ‘సింగపూర్’ జపం చేసిన సంగతి తెలిసిందే. అంతే కాదు..సీఎం ఏకంగా దేశీయ కంపెనీలను అవమానిస్తూ మాట్లాడటమే కాకుండా...సింగపూర్ కంపెనీలే బెస్ట్ అని బహిరంగంగా ప్రకటించారు. దీని కోసం ఏకంగా మౌలికసదుపాయాల చట్టంలో కూడా మార్పులు చేశారు. సింగపూర్ సంస్థలకే ‘స్విస్ ఛాలెంజ్’ విధానంలో పనులు అప్పగించేందుకు కోసమే ఈ మార్పులు చేశారు. అడ్డగోలు ఉల్లంఘనలకు పాల్పడుతూ ఏపీ సర్కారు అమరావతిలో స్టార్టప్ ఏరియా ప్రాజెక్టును సింగపూర్ సంస్థలైన అసెండాస్, సింగ్ బ్రిడ్జి, సెంబ్ కార్ప్ లిమిటెట్ కు అప్పగించారు. ఇది కూడా గత ఏడాది మే 14న జరిగింది. ఇది జరిగి ఎనిమిది నెలలు కావస్తున్నా ఇంత వరకూ సింగపూర్ సంస్థలు కూడా అడుగు ముందుకు వేయలేదు. ఎప్పుడు వేస్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వపరంగా అమరావతిలో చేపట్టాల్సిన అసెంబ్లీ, సచివాలయం, రాజ్ భవన్, హైకోర్టు భవనాల పనులు కూడా మొదలు కాలేదు. స్టార్టప్ ఏరియా కింద సింగపూర్ సంస్థలు దక్కించుకున్న ప్రాజెక్టులు కూడా ఎక్కడివి అక్కడే ఆగిపోయాయి.

అంతే కాదు...ఎప్పటి నుంచో ఏపీ సీఎం చంద్రబాబు సింగపూర్ ప్రధాని లీ సిన్ లూంగ్ ను అమరావతి రప్పించే ప్రయత్నాలు సఫలం కావటం లేదు. జనవరి 26న ఢిల్లీలో జరిగిన భారత గణతంత్ర వేడుకల్లో సింగపూర్ ప్రధాని పాల్గొన్నారు. దీంతో పాటు ఢిల్లీలో జరిగిన ఏషియాన్ సమావేశంలో కూడా ఆయన పాల్గొన్నారు. కానీ ఆయన అమరావతి వైపు కన్నెత్తి కూడా చూడలేదు. గతంలో కూడా సర్కారు సింగపూర్ ప్రధాని ఢిల్లీ వచ్చినప్పుడు ఏపీకి రప్పిస్తామని ప్రకటించింది. ప్రధాని రాకపోవటం ఒకెత్తు అయితే స్విస్ చాలెంజ్ విధానంలో పనులు దక్కించుకున్న సంస్థలు కూడా ఇటువైపు చూడటం లేదు. తొలుత కుదుర్చుకున్న ఒఫ్పందంలో ఎన్నో మార్పులు చేసిన సర్కారు అన్నీ సింగపూర్ కు అనుకూలంగా ఉండేలా మార్చిన సంగతి తెలిసిందే.

Next Story
Share it