Telugu Gateway
Andhra Pradesh

అమరావతి అంచనాలు పెంపు...కేంద్రం ఆమోదిస్తుందా!

అమరావతి అంచనాలు పెంపు...కేంద్రం ఆమోదిస్తుందా!
X

ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నిర్మాణాల కోసం కేంద్రం ఇఫ్పటికే 1500 కోట్ల రూపాయలు ఇచ్చేసింది. విజయవాడ, గుంటూరుల్లో మౌలికసదుపాయాల కల్పన కోసం వెయ్యి కోట్ల రూపాయలు మంజూరు చేసింది. అయితే శాశ్వత రాజధాని భవనాల నిర్మాణానికి సంబంధించి కేంద్రం ఇచ్చిన 1500 కోట్ల రూపాయలను ఏపీ సర్కారు తాత్కాలిక అసెంబ్లీ, సచివాలయం నిర్మాణాలకు వాడేసింది. కేంద్రం రాజధాని నిర్మాణం కోసం మరో వెయ్యి కోట్ల రూపాయలు మంజూరు చేసే అవకాశం ఉంది. కానీ అసెంబ్లీ, రాజ్ భవన్, హైకోర్టు, సచివాలయం తదితర నిర్మాణాల కోసం 11,600 కోట్ల రూపాయల వ్యయం అవుతుందని ఏపీ సర్కారు నివేదిక సిద్దం చేసింది. ఈ నివేదికను కేంద్రానికి పంపింది. అయితే కేంద్రం రాష్ట్రం కోరినంత మేర నిధులు మంజూరు చేసే అవకాశం ఉందా?. అంటే ఏమాత్రం లేదని అధికార వర్గాలు చెబుతున్నాయి.

పరిపాలనా రాజధానిలో ఉండే కీలక భవనాల నిర్మాణానికి 2500 కోట్ల రూపాయలు సరిపోతాయని..అంతే కానీ ఏపీ సర్కారు చెప్పినట్లు వేల కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసే అవకాశం లేదని చెబుతున్నారు. రాజధాని అంటే కేవలం పరిపాలనా కేంద్రమే కాదు...ఇది రాష్ట్రాన్ని పరుగులు పెట్టించే గ్రోత్ ఇంజన్ గా మారుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పదే పదే ప్రకటిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో ఎలా చేసుకున్నా తమకు అభ్యంతరం ఉండదని..కేంద్రం మాత్రం విభజనచట్టంలో ఉన్న ప్రకారం భవనాల నిర్మాణం కోసం..మౌలికసదుపాయాల కల్పనకు అవసరమైన నిధులు మాత్రమే కేటాయిస్తామని కేంద్ర మంత్రి ఒకరు తేల్చిచెప్పినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

అంతే కానీ చంద్రబాబునాయుడు అడ్డగోలుగా అంచనాలు పెంచి పంపే ప్రతిపాదనలను ఆమోదించే అవకాశంలేదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా ఏపీ నుంచి వచ్చే లెక్కలను కేంద్రం చాలా జాగ్రత్తగా పరిశీలిస్తోందని...టెండర్లలో అంచనాలు పెంచిన రీతిలోనే..కేంద్రానికి పంపే లెక్కల్లోనూ ఏపీ సర్కారు అన్నీ పెంచి పంపుతోందని కేంద్రంలో అధికారులు ఓ నిర్ణయానికి వచ్చారు. ఈ అంశాన్ని కూడా చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో రాజకీయ అస్త్రంగా వాడుకునే అవకాశం ఉంది. రాజధాని శంకుస్థాపనకు వచ్చిన సమయంలో ప్రధాని మోడీ ఓ మట్టి కుండ ఇవ్వటంతో ఏపీ ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్న విషయం తెలిసిందే. కేంద్రం ముందు భారీ ప్రతిపాదనలు పెట్టడం కేంద్రం ఇవ్వలేదని చెప్పటం ద్వారా తనపై వచ్చే విమర్శలను అటువైపు మళ్ళించటానికి చంద్రబాబు రకరకాల ప్లాన్స్ వేస్తున్నారని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

Next Story
Share it