అమరావతి...చంద్రబాబు బిగ్ ఫెయిల్యూర్!
ఎన్నికలకు ఇంకా సమయం మిగిలింది కేవలం పదకొండు నెలలే. ఇంత వరకూ సమగ్ర అమరావతి డిజైన్లే సర్కారు చేతికి అందలేదు. అవి అందేది ఎప్పుడు?? టెండర్లు పిలిచేది ఎప్పుడు?. పనులు మొదలయ్యేది ఎన్నడు?.ఇవి అధికార తెలుగుదేశం నేతలతో పాటు ఏపీ ప్రజలను వేధిస్తున్న ప్రశ్నలు. ఎంతలేదన్నా ఏపీ శాశ్వత రాజధాని భవనాల డిజైన్లు వచ్చి..టెండర్లు పిలిచి పనులు మొదలు పెట్టాలంటే మార్చి నెలాఖరు వరకూ పడుతుంది. అంటే అప్పటి నుంచి సర్కారుకు మిగిలేది కేవలం తొమ్మిది నెలలే. అందులో ఏప్రిల్, మే, జూన్ నెలల్లోనే పనులు జోరుగా సాగటానికి ఛాన్స్ ఉంటుంది. తర్వాత వర్షాకాలం మొదలవుతుంది. వర్షాకాలంలో పనులు ముందుకు సాగవు. అందునా అమరావతి వంటి డొల్ల నేలల్లో అసలు ముందుకు కదలవు పనులు. అంటే ఈ లెక్కన ఎన్నికల నాటికి ఏపీ ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్న కలల రాజధాని అమరావతికి సంబంధించి ఒక్కటంటే ఒక్క భవనం పూర్తయ్యే ఛాన్సే లేదు. అంటే సచివాలయం, అసెంబ్లీ, రాజ్ భవన్ వంటి శాశ్వత నిర్మాణాలేవీ లేకుండా ఎన్నికల బరిలోకి వెళ్ళాలన్న మాట. అంటే ఐదేళ్ళ తర్వాత కూడా శాశ్వత రాజధాని భవనాలు పూర్తి చేయకుండానే ప్రజల ముందుకెళ్ళి చంద్రబాబు ఏమని ఓట్లు అడుగుతారు?.అన్నది టీడీపీ నేతలకు పెద్ద ప్రశ్నగా మిగలనుంది.
ఏపీ నూతన రాజధానిగా అమరావతిని 2014 అక్టోబర్ 25నే ప్రకటించారు. ఆ తర్వాత అమరావతికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 2015 జూన్ లో శంకుస్థాపన చేశారు. 2015 అక్టోబర్ 22న మరోసారి ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా అమరావతి శంకుస్థాపన జరిగింది. తర్వాత మరోసారి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ శంకుస్థాపన చేశారు. శంకుస్థాపనలు మాత్రం రికార్డు స్థాయిలో జరిగినా..పనుల్లో మాత్రం ఏ మాత్రం పురోగతి లేదు. ప్రతి సోమవారం పోలవారం అంటూ హంగామా చేసినట్లుగానే ప్రతి బుధవారం అమరావతి పనులపై సమీక్ష చేస్తూనే ఉన్నారు. సమీక్షలు అయితే సాగుతున్నాయి కానీ ...ఆ మేరకు పనుల్లో పురోగతి మాత్రం ఏమీ ఉండటం లేదు. అయితే చంద్రబాబు ప్లాన్ మరోలా ఉందని టీడీపీలోని ఓ వర్గం చెబుతోంది. తాను మళ్లీ అధికారంలోకి వస్తే తప్ప అమరావతి ముందుకు సాగదని చెప్పి ప్రజల ఓట్లు కొల్లగొట్టాలనే ఆలోచనతోనే చంద్రబాబు నిర్మాణాల విషయంలో విపరీత జాప్యం చేస్తున్నారని చెబుతున్నారు. నాలుగేళ్ళ సమయంలో నాలుగు శాశ్వత భవనాలు పూర్తి చేయలేని చంద్రబాబు మాటలను ప్రజలు నమ్ముతారా?. మళ్ళీ ఆయనకు అవకాశం ఇస్తారా? అంటే ఎన్నికల వరకూ వేచిచూడాల్సిందే.