Telugu Gateway
Andhra Pradesh

ఏఏఐ వద్దు..అదానీ ముద్దు

ఏఏఐ వద్దు..అదానీ ముద్దు
X

మౌలిక సదుపాయాల శాఖలో అజయ్ జైన్ డబుల్ గేమ్

ఒకటే శాఖ. రెండు పద్దతులు. భోగాపురం విమానాశ్రయం అభివృద్ధి అవకాశం దక్కించుకున్న కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎయిర్ పోర్ట్స్ ఆథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) తనకు వచ్చే రెవెన్యూలో 30.20 శాతం వాటా ఏపీ ప్రభుత్వానికి ఇవ్వటానికి ముందుకొచ్చింది. అంతే కాదు..తమకు కేటాయించే భూమికి సంబంధించి కూడా ఏడాదికి 20 వేల రూపాయల లెక్కన లీజు లెక్కన కూడా ఇవ్వటానికి సమ్మతించింది. అయినా సరే చంద్రబాబు నేతృత్వంలోని కేబినెట్ ఏఏఐకి నో చెప్పి..టెండర్లు రద్దు చేసింది. ఇది ఓ కోణం. ఇక్కడే మరో గోల్ మాల్ జరిగింది. అదే మౌలికసదుపాయాలు, పెట్టుబడుల శాఖలోని భావనాపాడు ఓడరేవును అదానీ పోర్ట్స్ అండ్ ఎస్ఈజెడ్ లిమిటెడ్ కు అప్పగించే వ్యవహారం. అసలు ఈ ఓడరేవు బిడ్డింగ్ నాటికి అత్యంత కీలకమైన భద్రతాపరమైన అనుమతులే రాలేదు. అదానీ సింగిల్ బిడ్డర్ గా ఉందని తెలిసిన వెంటనే ఈ సెక్యూరిటీ క్లియరెన్స్ కూడా ఆగమేఘాల మీద వచ్చేసిందని అధికార వర్గాలు తెలిపాయి. శ్రీకాకుళం జిల్లాలోని భావనాపాడు ఓడరేవు అభివృద్ధి ప్రాజెక్టను సింగిల్ బిడ్డింగ్ ద్వారానే అదానీపోర్ట్స్ దక్కించుకుంది. ఈ సంస్థకు సర్కారు 2500 ఎకరాలు కేటాయించబోతుంది.

అయినా కూడా అదానీ పోర్ట్స్ తన ఆదాయంలో 0.5 శాతం మాత్రమే సర్కారుకు ఇవ్వటానికి ముందుకొచ్చింది. దీంతో అధికారులు రంగంలోకి దిగి అదానీతో బేరాలు మాట్లాడి తొలి 30 సంవత్సరాలకు 2.3 శాతం, ఆ తర్వాత పది సంవత్సరాలు 4.6 శాతం వాటా ఇచ్చేలా ఒప్పించారు. అంటే భోగాపురం విమానాశ్రయానికి సంబంధించి మంచి ఆఫర్ ఇచ్చిన ఏఏఐ టెండర్ ను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అండ్ కో రద్దు చేశారు. కానీ అత్యంత కీలకమైన భావనాపాడు ఓడరేవుకు సంబంధించి ఓ ప్రైవేట్ సంస్థతో బేరాలు ఆడాల్సిన అవసరం అధికారులకు ఎందుకు వచ్చింది. అదానీ చేసిన ఆఫర్ అతి తక్కువగా ఉన్నందున టెండర్లు రద్దు చేసి...మళ్ళీ పిలిస్తే కొత్త సంస్థలు వచ్చే అవకాశం ఉండేది. కానీ అలాంటి వాటికి స్కోప్ లేకుండా ఓ ప్రైవేట్ సంస్థతో బేరాలు నడపటం వెనక మతలబు ఏమిటి? అన్నది అధికార వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అంటే ప్రభుత్వంలో అడ్డగోలు వ్యవహారాలు ఎలా సాగుతున్నాయో తెలిసిపోతుంది.

Next Story
Share it