ఒక్క ఏడాదిలో 12 కోట్ల మంది ఎగిరిపోయారు
గగనయానం ఎవరికైనా ఆసక్తే. నిత్యం తిరిగేవారికి పెద్దగా జోష్ గా ఉండదు కానీ..అప్పుడప్పుడు మాత్రమే విమానయానం చేసేవారికి మాత్రం ఆ సరదా అలా కొనసాగుతూనే ఉంటుంది. గత కొంత కాలంగా దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. తొలిసారి భారత్ లో ఒకే ఏడాదిలో విమానయానం చేసిన వారి సంఖ్య రికార్డు స్థాయిలో 11.70 కోట్లకు పెరిగింది. 2017 జనవరి-డిసెంబర్ మధ్య కాలంలో దేశీయ విమాన ప్రయాణికుల్లో 17.31 శాతం పెరుగుదల నమోదు అయింది. అంతకు ముందు ఏడాది ఇదే కాలంలో దేశీయ విమానయానం చేసిన వారి సంఖ్య 9.98 కోట్లుగా ఉంది. డైరక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తాజాగా విడుదల చేసిన గణాంకాల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. 2017 డిసెంబర్ నెలలో ప్రయాణించిన వారి సంఖ్య 1.12 కోట్లుగా ఉంది.
ఇది అంతకు ముందే ఏడాది కాలం కంటే 18 శాతం అధికం. ఎప్పటిలాగే దేశీయ విమానయాన రంగంలో స్పైస్ జెట్ 95.06 శాతంతో అత్యధిక ప్యాసింర్ లోడ్ ఫ్యాక్టర్ కలిగిన సంస్థగా తన అగ్రస్థానాన్ని నిలుపుకుంది. మరో ప్రముఖ ఎయిర్ లైన్స్ ఇండిగో కూడా 90 శాతం పైగా ప్యాసింజర్ లోడ్ ఫ్యాక్టర్ సాధించింది. పర్యాటక సీజన్ కావటంతోనే నవంబర్ నెల కంటే డిసెంబర్ లో ప్యాసింజర్ లోడ్ ఫ్యాక్టర్ లో పెరుగుదల నమోదు అయిందని డీజీసీఏ తెలిపింది. ఎప్పటిలాగానే హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే ట్రూ జెట్ 3.11 శాతం సర్వీసుల రద్దుతో ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. సర్వీసుల రద్దు విషయంలో ట్రూజెట్ తర్వాత తిరిగి సర్వీసుల ప్రారంభించిన ఎయిర్ డెక్కన్ సంస్థ నిలిచింది.