Telugu Gateway
Telugu

‘పవన్ కళ్యాణ్’ చర్యలు ఊహాతీతం!

‘అజ్ఞాతవాసి’ సినిమాలో ఓ డైలాగ్ ఉంది. పవన్ కళ్యాణ్ యాక్షన్ చూసి రావు రమేష్ డైలాగ్ చెబుతారు. వీడి చర్యలు ఊహాతీతం అని. సరిగ్గా ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాజకీయాలకు సంబంధించి ఇదే చర్చ సాగుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్, పవన్ కళ్యాణ్ భేటీ వెనక అసలు కారణాలు ఏమిటో అనే అంశంపై ఓవైపు చర్చ సాగుతుంటే..సినీ రంగానికి చెందిన వారు మాత్రం మరో కోణంలో ఈ వ్యవహారాన్ని చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన అజ్ఞాతవాసి ఈ నెల 10న విడుదల కానున్న విషయం తెలిసిందే. ఉద్యమ సమయంలో పవన్ కళ్యాణ్ టీఆర్ఎస్ అగ్రనేతలైన కెసీఆర్, కవితలపై తీవ్ర విమర్శలు చేశారు. దానికి అప్పట్లో టీఆర్ఎస్ కూడా అంతే ధీటుగా కౌంటర్ ఇచ్చిందనుకోండి. కారణాలు ఏమైనా రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో పవన్ కు ఆదరణ కొంత తగ్గింది. తగ్గిన ఆదరణను తిరిగి పెంచుకోవటంతోపాటు...త్వరలో విడుదల కానున్న అజ్ఞాతవాసిని హిట్ చేసుకునేందుకే కెసీఆర్ పై పవన్ ప్రశంసల వర్షం కురిపించినట్లు ఫిల్మ్ నగర్ సర్కిల్స్ టాక్.

ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ఎస్ బలమైన శక్తిగా ఉన్న విషయం తెలిసిందే. కెసీఆర్ ఇంటికెళ్లి మరీ ఆయనతో భేటీ అయిన పవన్ తెలంగాణ సీఎంపై ప్రశంసల వర్షం కురిపించటం..దేశానికి రోల్ మోడల్ అంటూ ప్రకటించటం వెనక పలు రకాల కోణాలు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా తన సినిమాల సమయంలో ఏదో ఒక వివాదాన్ని లేవనెత్తి విపరీతమైన ప్రచారం పొందుతారు. ఇఫ్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఇదే మోడల్ ఫాలో అవుతున్నట్లు కన్పిస్తోందని సినీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.

Next Story
Share it