Telugu Gateway
Andhra Pradesh

ఏపీ సర్కారుకు ప్రపంచ బ్యాంకు షాక్!

ఆంధ్రప్రదేశ్ సర్కారుకు షాక్. నూతన రాజధాని అమరావతిలో చేపట్టదలచిన పలు ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు నుంచి రుణం కోరుతోంది. ఈ రుణంపై సర్కారు ఎన్నో ఆశలు కూడా పెట్టుకుంది. అయితే తాజా పరిణామాల ప్రకారం ప్రపంచ బ్యాంకు రుణం ఇప్పట్లో మంజూరు అయ్యే అవకాశం కన్పించటం లేదు. ఈ రుణం మంజూరు విషయంలో కనీసం ఆరు నెలల పాటు ఎలాంటి నిర్ణయం వెలువడదు. ఆ తర్వాత కూడా వెంటనే రుణం మంజూరు చేస్తారా?. లేక తమకు వచ్చిన ఫిర్యాదులపై క్షేత్ర స్థాయిలో పరిశోధన చేసిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటారా? అన్న అంశం తేలాల్సి ఉంది. ప్రస్తుతానికి అయితే ఈ నిర్ణయాన్ని ఆరు నెలల పాటు పెండింగ్ లో పెట్టాలని ప్రపంచ బ్యాంకు తాజాగా నిర్ణయం తీసుకుంది. రాజధాని నిర్మాణం కోసం ఏపీ ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ విధానం కింద 33 వేల ఎకరాలకుపైగా తీసుకున్న విషయం తెలిసిందే. అయితే కొంత మంది రైతులు తమ దగ్గర నుంచి బలవంతంగా భూములు తీసుకున్నారని ప్రపంచ బ్యాంకుకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును పరిశీలించిన ప్రపంచ బ్యాంకు తనిఖీ బృందం దీనిపై మరింత పరిశోధన చేయాల్సిన అవసరం ఉందని సిఫారసు చేయటంతో రుణం వ్యవహారం డైలమాలో పడినట్లు అయింది.

ఈ లోగా తమకు అందిన ఫిర్యాదుపై మరింత లోతుగా పరిశోధన చేయాల్సిన అవసరం ఉందా? లేదా అనే అంశంపై ప్రపంచ బ్యాంకు బృందం ఓ నివేదిక ఇవ్వనుంది. ఏపీ ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు నుంచి అమరావతి అభివద్ధి కోసం 300 మిలియన్ డాలర్ల రుణాన్ని ఆశిస్తోంది. ప్రపంచ బ్యాంకు ప్యానల్ సెప్టెంబర్ లో అమరావతిలో పర్యటించి..బ్యాంకు బోర్డు ఎగ్జిక్యూటివ్ డైరక్లర్లకు ఓ నివేదిక అందజేసింది. అందులో బ్యాంకు నిబంధనలకు భిన్నంగా పలు అంశాలు ఉన్నందున రైతులు చేస్తున్న ఆరోపణలపై పరిశోధన చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. తాజా పరిణామాలతో బోర్డు కూడా తన నిర్ణయాన్ని వాయిదా వేసుకోవటంతో ఇప్పటికిప్పుడు ప్రపంచ బ్యాంకు అమరావతికి రుణం మంజూరు చేసే ప్రక్రియ వాయిదాపడినట్లు అయింది.

Next Story
Share it