విశాఖ విమానాశ్రయంలో వీసా ఆన్ అరైవల్
కొన్ని దేశాల్లో పర్యటించాలంటే వీసా తప్పనిసరి. ముందుగా వీసా తీసుకుంటేనే ఆ దేశంలోకి అనుమతిస్తారు. లేకపోతే అడుగుపెట్టడం కూడా సాధ్యం కాదు. కొన్ని దేశాలు అయితే ఎంపిక చేసిన దేశాలకు వీసా ఆన్ అరైవల్ సౌకర్యం కల్పిస్తున్నాయి. విమానాశ్రయంలో దిగిన తర్వాత అక్కడే వీసా తీసుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ముందుగా ఎక్కడ నివాసం ఉండబోతున్నది..దానికి సంబంధించిన బుకింగ్ వివరాలు అందజేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం విమానాశ్రయంలో కూడా వీసా ఆన్ అరైవల్ సౌకర్యం కల్పించారు. అంటే విదేశీయులు నేరుగా టిక్కెట్ తీసుకుని విశాఖపట్నం చేరుకోవచ్చు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వీసా ఆన్ ఆరైవల్ సౌకర్యం అందించే విమానాశ్రయాల్లో విశాఖను కూడా చేర్చింది.
కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయం విశాఖలో పర్యాటక రంగం అభివృద్ధికి దోహదపడగలదని భావిస్తున్నారు. విశాఖలో అందమైన బీచ్ లతో పాటు ఎన్నో పర్యాటక ప్రాంతాలు ఉన్న సంగతి తెలిసిందే. విశాఖ ప్రాంతంలో అరకు, బొర్రా గుహాలు పర్యాటకులకు ఎంతో ప్రత్యేక అనుభూతిని అందిస్తాయి. ఇప్పుడు ఏకంగా 147 దేశాలకు చెందిన వారు ఇక నేరుగా విశాఖకు చేరుకోవచ్చు. భారత్ నుంచి పర్యాటకులు పెద్ద సంఖ్యలో వెళ్ళే బ్యాంకాంక్, హాంకాంగ్, శ్రీలంక దేశాల్లో భారతీయులకు వీసా ఆన్ అరైవల్ సౌకర్యం ఉంది.