విజయసాయి ఆత్మహత్యలో కొత్త మలుపు
టాలీవుడ్‌కు చెందిన హాస్యనటుడు విజయసాయి ఆత్మహత్యలో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆయన ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ఈ వీడియోను పోలీసులు స్వాధీనం చేసుకుని విచారణ వేగం పెంచారు. ఈ వీడియోలో తన చావుకు భార్య వనితతో పాటు ఓ ప్రముఖ సంస్థకు చెందిన డైరెక్టర్ శశిధర్, అడ్వకేట్ శ్రీనివాస్ కారణమని విజయ్ సాయి సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు అతడు తీసుకున్న సెల్ఫీ వీడియోలో పలు విషయాలు వెల్లడించాడు.‘వాల్ పోస్టర్ సినిమా షూటింగ్‌లో వనిత నాకు పరిచయమైంది. పెళ్లైన తర్వాత ఆమె నిజస్వరూపం నాకు తెలిసింది. వ్యాపార అవకాశాల కోసం వనితను శశిధర్ ఉపయోగించుకున్నాడు. నా కూతురిని కూడా చూడనివ్వడం లేదు. వాళ్ల వేధింపులు భరించలేకపోయాను. వనితలాంటి వారిని వదిలిపెట్టొద్దు. డాడీ అందరికీ శిక్ష పడేలా చూడు.. ఐ లవ్ యూ డాడీ’ అంటూ సెల్ఫీ వీడియోలో విజయ్ పేర్కొన్నాడు.
అందరూ కలసి తనను మానసికంగా వేధింపులకు గురిచేసినట్లు పేర్కొన్నాడు. తన కూతురు అలాంటి వాతావరణంలో పెరగటం ఇష్టంలేదని..వెంటనే తనను ఇంటికి తీసుకురావాలని విజయసాయి తన తండ్రిని కోరాడు. ఈ వ్యవహారంపై సాయి భార్య వనిత కూడా స్పందించారు. అసలు విజయ్ ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందో తనకు తెలియదని వ్యాఖ్యానించారు. ఆమె విజయ్ పై ఆరోపణలు చేశారు. విజయ్ కు వేరే మహిళతో సంబంధం ఉందని..ఆ విషయం తాను కళ్లారా చూశానని తెలిపారు. అప్పటి నుంచే తమ కుటుంబంలో కలతలు మొదలయ్యాయని..గత రెండేళ్లుగా విడాకుల కేసు కోర్టులో సాగుతోందని తెలిపారు. పెళ్లి సమయంలో ఇచ్చిన కట్న, కానుకలు మాత్రం వెనక్కి ఇవ్వాలని కోరామని..పాపను తానే చూసుకోవాల్సి ఉన్నందున అవి కోరినట్లు వనిత మీడియాకు తెలిపారు.