Telugu Gateway
Telangana

ఉమామాధ‌వ‌రెడ్డికి సీటు గ్యారంటీ లేదా?

టీ టీడీపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి ఉమామాధ‌వ‌రెడ్డి గురువారం టీఆర్ ఎస్ లో చేరారు. ఆమెకు...ఆమె త‌న‌యుడు సందీప్ రెడ్డిని టీఆర్ఎస్ అధినేత, ముఖ్య‌మంత్రి కెసీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు. కొద్ది రోజుల క్రితం మీడియాతో మాట్లాడిన ఉమా మాధ‌వ‌రెడ్డి కాంగ్రెస్ లో త‌న‌కు సీటు గ్యారంటీ ఇవ్వ‌లేద‌ని అందుకే చేర‌లేద‌ని స్ప‌ష్టం చేశారు. సీటు హామీ లేకుండా ఎవ‌రైనా పార్టీ మార‌తారా? అని ప్ర‌శ్నించారు. అయితే వీరి చేరిక సంద‌ర్భంగా కెసీఆర్ చేసిన ప్ర‌క‌ట‌న ఆస‌క్తిక‌రంగా ఉంది. తమ పార్టీలో చేరేందుకు ఉమామాధ‌వ‌రెడ్డి ఎలాంటి డిమాండ్లు పెట్ట‌లేద‌ని కెసీఆర్ ప్ర‌క‌టించ‌టం విశేషం. రాజకీయాల్లో ఎప్పుడు ఎవరికి ఎటువంటి అవకాశాలు వస్తాయో చెప్పలేమని చంద్రశేఖర్‌రావు అన్నారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని వ్యాఖ్యానించారు.

ఉమామాధ‌వ‌రెడ్డి చేరిక సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ.. మాధవరెడ్డి తనకు ఆత్మీయ మిత్రుడని, ఆయన మన మధ్య లేకపోవటం దురదృష్టకరమన్నారు. నల్లగొండ జిల్లా నుంచి చాలా మంది మంత్రులయ్యారు కానీ, జిల్లా మొత్తాన్ని పట్టించుకున్న ఏకైక మంత్రి మాధవరెడ్డి అని ప్రశంసించారు. ఉమామాధవరెడ్డి తనకు తోబుట్టువు లాంటివారని అన్నారు. తమ పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామమని తెలిపారు. నల్గొండ జిల్లా బాగా వెనకపడిన జిల్లా అని, భువనగిరి వరకు ఐటీని అభివృద్ధి చేస్తామని చెప్పారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ అభివృద్ధి జరిగి తీరాలని స్పష్టం చేశారు. అంతర్జాతీయ స్థాయిలో పేరుపొందేలా యాదాద్రిని అభివృద్ధి చేస్తామన్నారు. టీఆర్ ఎస్ లో చేరిన త‌ర్వాత ఉమా మాధ‌వ‌రెడ్డి మాట్లాడుతూ పార్టీలో మంచి భ‌విష్య‌త్ ఉంటుంద‌ని కెసీఆర్ హామీ ఇచ్చార‌న్నారు. ప‌ద‌వులు గురించి మాట్లాడ‌టం స‌రికాద‌న్నారు.

Next Story
Share it