‘2 కంట్రీస్’ మూవీ రివ్యూ
హీరోగా మారినప్పటి నుంచి సునీల్ కు కష్టాలు తప్పటంలేదనే చెప్పొచ్చు. అప్పటి వరకూ కమెడియన్ గా ఉన్న సునీల్ చాలా కష్టపడి హీరోగా మారేందుకు ప్రయత్నించాడు. అందులో అరకొర సక్సెస్ అయినా మొత్తం మీద సునీల్ హీరోగా చెప్పుకోదగ్గ విజయాలు అందుకోలేకపోయాడు. అందుకే ఇప్పుడు మళ్ళీ పాత కమెడియన్ రోల్ కు మళ్ళటానికి నిర్ణయించుకున్నాడు. ఈ తరుణంలో సునీల్ హీరోగా నటించిన ‘2 కంట్రీస్’ శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఆ సినిమా ఎలా ఉందో తెలుసుకోవాలంటే ముందుకు వెళ్లాల్సిందే...ఇక సినిమా అసలు కథ విషయానికి వస్తే ఉల్లాస్ కుమార్ (సునీల్) బాధ్యత లేకుండా ఊళ్ళో తిరుగుతుంటాడు. ఎవరో ఒకరిని మోసం చేసి డబ్బు సంపాదించి దాంతో జల్సాలు చేయటానికి చూస్తుంటాడు. ఆ క్రమంలో స్నేహితులతో పాటు కుటుంబాన్ని కూడా ఇరకాటంలోకి నెడతాడు. వెంకటాపురం గ్రామంలోనే పటేల్ అనే రౌడీ దగ్గర తాను తీసుకున్న అప్పును తీర్చలేక రెండు కాళ్లు లేని వాళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాడు. అదే సమయంలో ఒకప్పుడు అదే ఊళ్ళో ఉండి..తర్వాత ఫారిన్ లో సెటిల్ అయిన తన చిన్ననాటి స్నేహితురాలు లయ (మనీషా రాజ్)తో పరిచయం అవుతుంది.
ఆమె కోట్ల ఆస్తిని సొంతం చేసుకోవాలన్న ఆశతో పటేల్ వాళ్ల సంబంధం కాదని లయను పెళ్లి చేసుకుంటాడు. అక్కడ నుంచి ఉల్లాస్ కు మరిన్ని కష్టాలు మొదలవుతాయి. తాను చిన్నప్పుడు ఊరిలో కళ్లు తాపించిన స్నేహితురాలు తర్వాత మద్యానికి బానిస అవుతుంది. పెళ్ళి అయిన ఫస్ట్ నైట్ ఫుల్ గా మందు కొట్టి పడిపోతుంది. దీంతో షాక్ కు గురైన ఉల్లాస్ ఏమి చేశాడు. వీరి బంధం ఎలా ముందుకు సాగిందో తెలుసుకోవాలంటే వెండితెరపై చూడాల్సిందే. సునీల్ ఈ సినిమాలో తనకు అలవాటైన కామెడీ టైమింగ్ తో అక్కడక్కడ ఆకట్టుకుంటాడు. సెంటిమెంట్ సీన్స్ లోనూ సునీల్ నటన ఆకట్టుకుంటుంది. తొలి సినిమానే అయినా మనీషా రాజ్ మంచి నటన కనబరిచింది.
మద్యానికి బానిసైన అమ్మాయి పాత్రలో చాలా బాగా నటించింది. హీరో ఫ్రెండ్ పాత్రలో శ్రీనివాస్ రెడ్డి కామెడీ బాగుంది. ఇతర పాత్రల్లో 30 ఇయర్స్ పృథ్వీ, నరేష్ తదితరులు తమ పరిధి మేరకు ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. దర్శకుడు ఎన్.శంకర్ మలయాళంలో ఘనవిజయం సాధించిన సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ రాం ప్రసాద్ సినిమాటోగ్రఫి. పల్లెటూరి అందాలతో పాటు ఫారిన్ లొకేషన్స్ ను కూడా చాలా బాగా చూపించారు. రీమేక్ చేసినా కూడా సునీల్ సక్సెస్ అందుకోలేకపోయాడనే చెప్పొచ్చు.
రేటింగ్. 2/5