Telugu Gateway
Telugu

తలాకు కు తలాక్!

కేంద్ర ప్రభుత్వం తలాక్ కు తలాక్ చెప్పేసింది. ఇక తలాక్ అని మూడు సార్లు చెప్పి భార్యను వదిలేయటం కుదరదు. ఇప్పటివరకూ ఇది చెల్లుబాటు అవుతూ వస్తోంది. అయితే మహిళలు చాలా మంది ఈ తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తక్షణ ట్రిపుల్‌ తలాక్‌ను చట్టవ్యతిరేకంగా గుర్తించి భర్తకు మూడేళ్ల జైలుశిక్ష విధించే ‘ముస్లిం మహిళల (వివాహ హక్కుల పరిరక్షణ) బిల్లు’కు గురువారం లోక్‌సభ ఆమోదం తెలిపింది. బిల్లును వ్యతిరేకిస్తూ పలు పక్షాల ఎంపీల ఆందోళనల మధ్యే.. న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ సభలో ఈ బిల్లును పెట్టారు. మహిళా హక్కులను కాపాడే దిశగా దేశ చరిత్రలో ఇదో గొప్ప రోజు అని రవిశంకర్‌ ప్రసాద్‌ పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఈ బిల్లుకు మద్దతు తెలుపుతూనే.. విడాకులు పొందిన ముస్లిం మహిళలకు న్యాయం జరిగేలా మరిన్ని నిర్దిష్టమైన అంశాలను బిల్లులో చేర్చాలని పట్టుబట్టింది. బిల్లుపై వెంటనే ఓటింగ్‌ పెట్టకుండా స్టాండింగ్‌ కమిటీ పరిశీలనకు పంపాలని కాంగ్రెస్‌ పక్షనేత మల్లికార్జున ఖర్గే డిమాండ్‌ చేశారు. అయితే ఇది ముస్లింల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించటంతోపాటు, ముస్లిం మహిళలకు అన్యాయం చేసేలా ఉందంటూ మజ్లిస్‌ ఎంపీ ఒవైసీ తీవ్రంగా విమర్శలు గుప్పించారు.

అయితే.. బిల్లుపై చర్చ సందర్భంగా ఒవైసీ సహా పలువురు విపక్ష సభ్యులు సూచించిన సవరణలను తిరస్కరించిన అనంతరం లోక్‌సభలో బిల్లు ఆమోదం పొందింది. అంతకుముందు, ఏకాభిప్రాయ సాధనతోనే ఈ బిల్లును ఆమోదించుకోవాలని ప్రధాని మోదీ బీజేపీ పార్లమెంటరీ పార్టీ భేటీలో సూచించారు. గురువారం సభ ప్రారంభం కాగానే.. బిల్లును ప్రవేశపెట్టేందుకు అనుమతివ్వాలని స్పీకర్‌ను మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ కోరారు. దీనికి అనుమతివ్వటంతోనే బిల్లును వ్యతిరేకిస్తున్న పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ సభాకార్యక్రమాలకు ఆటంకం కలిగించాయి. మజ్లిస్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ సహా, ఇండియన్‌ ముస్లిం లీగ్, బీజేడీ, అన్నాడీఎంకే, సమాజ్‌వాదీ పార్టీ, బీఎస్పీ తదితర పార్టీలు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశాయి. దీంతో గందరగోళం మధ్యే.. మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. అయినా సరే లోక్ సభ ఈ బిల్లును మూజువాణి ఓటుతో ఆమోదం తెలిపింది. దీంతో బిజెపి తాను అనుకున్నట్లే తలాక్ కు తలాక్ చెప్పినట్లు అయింది.

Next Story
Share it