రాజకీయాలకు సోనియా గుడ్ బై
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్లు శుక్రవారం నాడు ప్రకటించారు. పదేళ్ల యూపీఏ పాలనలో ఆమె అంతా తెర వెనక ఉండి నడిపించారు. సోనియా గాంధీ ఓ దశలో ప్రధాని పదవి చేపట్టాలని భావించినా ఆమె విదేశీయత అంశం పెద్ద చర్చనీయాంశంగా మారి...వెనక్కి తగ్గాల్సి వచ్చింది. పదేళ్ల యూపీఏ కాలంలో పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. అదే సమయంలో పలు స్కాంలు కూడా ప్రభుత్వ ప్రతిష్టను మసకబారేలా చేశాయి. తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కనీసం ప్రతిపక్ష హోదాను కూడా దక్కించుకోలేకపోయిన విషయం తెలిసిందే. సరిగ్గా సోనియా తనయుడు రాహుల్ గాంధీ అధ్యక్ష పీఠం ఎక్కబోతున్న తరుణంలో ఆమె రాజకీయల నుంచి వైదొలగాలని నిర్ణయం తీసుకున్నారు.
శుక్రవారం ప్రారంభం అయిన పార్లమెంట్ సమావేశాలకు సోనియా హాజరయ్యారు. సభ ముగిసిన తర్వాత బయటకు వెళుతూ మీడియాతో మాట్లాడారు. ఆ సమయంలోనే ఈ సంచలన ప్రకటన చేశారు. రాహుల్ గాంధీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక పార్టీలో మీ రోల్ ఎలా ఉండబోతుంది అని ఓ విలేకరి ప్రశ్నించగా..ఆమె తాను రాజకీయాల నుంచి తప్పుకోనున్నటు తెలిపారు. శనివారం నాడే రాహుల్ కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనున్నారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న సోనియా త్వరలోనే పూర్తి స్థాయి విశ్రాంతి తీసుకోవాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. 19 సంవత్సరాల పాటు కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సోనియా ఓ రికార్డు నెలకొల్పారు.