Telugu Gateway
Andhra Pradesh

వీర్రాజుకు కౌంటర్ ఇచ్చినా చంద్రబాబు లో ఉలికిపాటు!

టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిలో ఎందుకంత ఖంగారు?. బిజెపి ఎమ్మెల్సీ, ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు వ్యాఖ్యలకు టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ కౌంటర్ ఇవ్వగానే చంద్రబాబు అంతగా ఆందోళన చెందాల్సిన అవసరం ఏముంది?. అసలు పార్టీ ఆమోదం లేకుండా పార్టీ వేదికపై ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ అంత ఘాటుగా స్పందిస్తారా?. ఆయనకు వ్యక్తిగతంగా ఆ అవసరం ఏముంది?. కొద్ది రోజుల క్రితమే కదా..చంద్రబాబు బిజెపి నేతలపై వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించింది. అలాంటిది బిజెపి గెలుపు జోష్ లో ఉన్న సమయంలో రాజేంద్రప్రసాద్ సొంతంగా ఎందుకు కయ్యానికి కాలుదువ్వుతారు?. ఇదీ టీడీపీ వర్గాల్లో సాగుతున్న చర్చ. సోము వీర్రాజు సోమవారం నాడు అయితే టీడీపీపై తీవ్ర వ్యాఖ్యలే చేశారు. దానికి కొనసాగింపుగా ఆయన మంగళవారం నాడు కూడా టీడీపీపై తనదైన శైలిలో దాడి కొనసాగించారు. నంద్యాల ఉప ఎన్నికలో టీడీపీ గెలిచిన తర్వాత ఇది మోడీ ఓటమి అని ఓ టీడీపీ నేత వ్యాఖ్యానించారని..ఆ సమయంలో తాను అక్కడే ఉన్నానని సోము వీర్రాజు తెలిపారు.

‘మేం నోట్లు రద్దు చేసి గెలిస్తే...కొంత మంది నోట్లు పంచి గెలుస్తున్నారు’ అని సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. పాత బిజెపి వేరు...2014-2017 బిజెపి వేరు అని సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. ఏపీలో మేం బలపడతాం అంటే ఎందుకు ఉలిక్కిపడుతున్నారో అర్థం కావటంలేదని వ్యాఖ్యానించారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన వీర్రాజు ఏకంగా చంద్రబాబుపై కూడా విమర్శలు చేశారు. ‘కాంగ్రెస్‌ సహకారంతోనే నేషనల్‌ ఫ్రంట్‌ కన్వీనర్‌ గా చంద్రబాబు ఒకరిని ప్రధానమంత్రిని చేశారు. టీడీపీతో పొత్తు లేనప్పుడే మాకు 18 శాతం ఓట్లు వచ్చాయి. టీడీపీతో కలిసి వెళ్లడం వలన 2004 ఎన్నికల్లో ఓడిపోయాం. ఇలాంటి నిర్ణయం చారిత్రక తప్పిదం. 10 సంవత్సరాలు కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చింది. 2009లో టీడీపీ ఒంటరిగా పోటీ చేసి ఓడిపోయింది. బీజేపీతో పొత్తు పెట్టుకుని చరిత్రాత్మక తప్పు చేశామని చంద్రబాబు గతంలో చెప్పారు. 2014 ఎన్నికల్లో టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకోమని ఉదయం చెప్పి... సాయంత్రానికి చల్లబడ్డారు. కాకినాడ మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేసి మేము ఎక్కువ స్థానాల్లో గెలిసేవాళ్లమని, అయితే టీడీపీ వాళ్లు డబ్బులు ఖర్చు పెట్టి గెలిచారు.

కాకినాడకు స్మార్ట్‌ సిటీ, పోర్ట్‌ ఇచ్చాం. కాకినాడలో చెప్పుకోవడానికి టీడీపీకి ఏమీలేదు. ప్రతిసారి మిత్రపక్షం చేతిలో మోసపోతున్నాం. కనీసం పార్టీ కార్యకర్తలకు కూడా ఇళ్లు, రేషన్‌ కార్డులు, పింఛన్లు ఇప్పించుకోలేకపోతున్నాం. బీజేపీ ఎదుగుతుంటే అడ్డుకొనేందుకు కుట్ర చేస్తున్నారు. లేకుంటే ప్రత్యేక హోదా అంశాన్ని తెరమీదకు తెస్తున్నారు. ప్యాకేజీకి చంద్రబాబు ఒప్పుకున్నారు. ప్యాకేజీ ద్వారా వచ్చేది 3వేల కోట్లు మాత్రమే. పోలవరం ప్రాజెక్టుకు అడ్డంకులు తొలగించింది బీజేపీనే. పోలవరంపై చిత్తశుద్ధి ఉంటే 1995 నుంచి 2004 వరకూ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఎందుకు శంకుస్థాపన చేయలేకపోయారు. బీజేపీతో పొత్తు వద్దనుకుంటే చంద్రబాబు చెప్పాలి. టీడీపీ నేతలు వాళ్ల పరిధిని మించి మాట్లాడుతున్నారు.’ అని వీర్రాజు మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ ను కూడా విడిగా ప్రచారం చేయమని కొంత మంది పంపిస్తున్నారని వీర్రాజు ఆరోపించారు.

Next Story
Share it