Telugu Gateway
Cinema

‘సప్తగిరి ఎల్ ఎల్ బి’ మూవీ రివ్యూ

సప్తగిరి. ఈ పేరు చెప్పగానే నవ్వు రావటం ఖాయం. కానీ సప్తగిరి ఈ మధ్య వరస పెట్టి హీరోగా చేస్తున్నాడు. ఇప్పటికే సప్తగిరి ఎక్స్ ప్రెస్ సినిమాతో సందడి చేసిన ఆయన ఇప్పుడు సప్తగిరి ఎల్ ఎల్ బి పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సప్తగిరి, కాశిష్ వోహ్ర జంటగా నటించిన ఈ సినిమా గురువారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సప్తగిరి కామెడీ తరహాలో హీరోగానూ ప్రేక్షకులను మెప్పించాడా? లేదా తెలుసుకోవాలంటే ముందుకు వెళ్లాల్సిందే. సినిమా అసలు కథ విషయానికి వస్తే అంతా ఓ కేసు చుట్టూనే తిరుగుతుంటుంది. మందు కొట్టి డ్రైవ్ చేసిన వ్యక్తి ఐదుగురి ప్రాణాలు పోవటానికి కారణం అవుతాడు. అయితే చనిపోయింది రైతులు అంటే గొడవలు అవుతాయని భావించి..చనిపోయిన వారు ఫుట్ పాత్ పై నిద్రపోతున్న బిచ్చగాళ్లుగా చిత్రీకరిస్తారు. కానీ వాళ్ళు నగరానికి విత్తనాల కోసం వచ్చిన రైతులు. ప్రమాదం చేసింది కారు అయితే...మరో వాహనంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తారు. సినిమా అంతా ఈ కేసు చుట్టూనే తిరుగుతుంది. గ్రామంలో లాభం లేదనుకుని లాయర్ గా విజయం సాధించాలంటే పట్టణంలోనే బెటర్..అక్కడ సీనియర్లు ఉంటారని పట్టణానికి వచ్చిన సప్తగిరి ఈ కేసు టేకప్ చేస్తారు.

నిందితుల తరపున రాజ్ పాల్ (సాయికుమార్) వాదిస్తారు. సప్తగిరి ఎంతో పేరున్న రాజ్‌పాల్ వాదించిన ఓ కేసును పిల్ వేసి మ‌ర‌లా రియోప‌న్ చేయిస్తాడు. ఆ కోర్టుకు జ‌డ్జి (శివ‌ప్ర‌సాద్‌). ఎంతో సీనియర్ అయిన..కాకలు తీరిన లాయర్ అయిన రాజ్ పాల్ ను సప్తగిరి ఓడించాడా?. ఓడిస్తే అది ఎలా జరిగింది వెండి తెరమీదే చూడాలి. ఫస్టాఫ్ ఒకింత కామెడీతో త‌ర్వాత సీరియ‌స్‌గా సాగే పాత్ర‌లో త‌న‌దైన రీతిలో స‌ప్త‌గిరి తన పాత్ర‌లో ఒదిగిపోయాడు. అలాగే సెకండాఫ్‌లో రైతుల‌కు న్యాయం చేసే విధంగా పోరాడే స‌న్నివేశాల్లో స‌ప్త‌గిరి న‌ట‌న మెప్పిస్తుంది. సెకండాఫ్ తర్వాత కోర్టులో సాయికుమార్, సప్తగిరిలు ఎమోష‌న‌ల్‌గా మాట్లాడే స‌న్నివేశాలు అల్టిమేట్. డ్యాన్సులు ప‌రంగా స‌ప్త‌గిరి మెప్పించాడు. ఇక హీరోయిన్ కాశిష్ వోరా గురించి పెద్దగా చెప్పుకోవాల్సింది ఏమీ లేదు. లాయర్ రాజ్‌పాల్ గా సాయికుమార్ పాత్ర సూపర్బ్ అనేలా ఉంది. చాలా సార్లు సాయికుమార్ ముందు సప్తగిరి పూర్తిగా తేలిపోతాడు. జ‌డ్జి పాత్ర‌లో న‌టించిన శివ‌ప్ర‌సాద్ కూడా తన పాత్రకు పూర్తి న్యాయం చేశారు. ఈ సినిమా బాలీవుడ్‌లో విజ‌య‌వంత‌మైన జాలీ ఎల్‌.ఎల్‌.బి సినిమాకు ఇది రీమేక్‌. సప్తగిరి ఎల్ ఎల్ బి ప్రేక్షకుల కోర్టులో కూడా గెలిచినట్లే లెక్క.

రేటింగ్.2.25/5

Next Story
Share it