ప్రగతి భవన్ కట్టారు..క్రిస్టియన్ భవన్ కట్టలేరా!
తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ కు కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి మరో లేఖాస్త్రం సంధించారు. క్రిస్మస్ పండగ వస్తుండటంతో ఆయన టైమ్ చూసుకుని రంగంలోకి దిగారు. ప్రగతి భవన్ కట్టుకున్నారు కానీ...క్రిస్టియన్ భవన్ కట్టలేరా? అని రేవంత్ రెడ్డి తన లేఖలో ప్రశ్నించారు.
క్రిస్టియన్ భవన్ శిలాఫలకం వద్ద ఏరియా పిచ్చి మొక్కలు మొలిచి ఉన్న ఫొటోలను కూడా లేఖకు జత చేశారు. సర్కారు క్రిస్టియన్ లను అవమానిస్తున్నారని ఆరోపించారు. ‘రాష్ట్రంలో క్రిస్టియన్ సోదరులను మీరు మాత్రమే ఆదరిస్తున్నారని, మీ ప్రభుత్వం మాత్రమే గౌరవిస్తోందనే రీతిలో మీరూ, మీ మంత్రులు మాయ మాటలు చెబుతున్నారు.. కానీ వాస్తవానికి క్రిస్టియన్ భవన్ నిర్మాణం విషయంలో మీరూ, మీ ప్రభుత్వం అనుసరిస్తున్న ధోరణి అనుచితంగానే కాదు యావత్ క్రిస్టియన్ సోదరులను దారుణంగా అవమానించేదిగా ఉంది. ఈ విషయాన్ని మరిపించడానికి మీరు ఎన్ని గారడీలు చేసినా పంజాగుట్ట చౌరస్తాలో వందల కోట్ల వ్యయంతో మీరు కట్టుకున్న గడీ ఈ విషయాన్ని వారికి గుర్తుకు తెస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాష్ట్రంలో క్రిస్టియన్ సోదరులు ఈనెల 25న నాల్గవ క్రిస్‌మస్ పండుగను జరుపుకుంటున్న నేపథ్యంలో క్రిస్టియన్ భవన్ విషయంలో మీరు చేసిన మోసం గురించి వారందరితో పాటుగా తెలంగాణా సమాజం దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తర్వాత క్రిస్టియన్ సోదరుల సంక్షేమం గురించి ఎన్నో మాటలు చెప్పిన మీరు రూ.10 కోట్లతో తెలంగాణ క్రిస్టియన్ భవనాన్ని సకల సౌకర్యాలతో నిర్మించనున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్ నగరంలో మారేడ్‌పల్లి మండలం, మల్కాజ్‌గిరి గ్రామానికి చెందిన మహేంద్రహిల్స్ సర్వే నెంబర్ 844/1 లో రెండు ఎకరాల స్థలాన్ని కేటాయిస్తున్నట్లు ఆదేశాలివ్వడంతోపాటు 2014, డిసెంబర్ 23న ఆ భూమిలో క్రిస్టియన్ భవన నిర్మాణానికి మీరే స్వయంగా శంకుస్థాపన చేసారు. ఏడాది కాలంలోపుగా క్రిస్టియన్ భవన నిర్మాణాన్ని పూర్తి చేస్తామని హామీ ఇవ్వడంతో పాటు రాబోయే క్రిస్‌మస్‌ను కొత్త క్రిస్టియన్ భవన్‌లో అందరం కలిసి ఆనందంగా జరుపుకుందామంటూ అందరినీ ఊహల పల్లకిలో ఎక్కించారు.
శంకుస్థాపన చేసిన తర్వాత ఈ క్రిస్టియన్ భవన నిర్మాణపనులను పర్యవేక్షించడానికి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి,ఎమ్మెల్సీ రాజేశ్వర్ రావు, ఎమ్మెల్యే స్టీఫెనసన్‌తో పాటుగా రాష్ట్రస్థాయిలోని అధికారులతో కలిపి తొమ్మిది మందితో ఒక కమిటీని కూడా నియమిస్తున్నట్లు మైనార్టీసంక్షేమ శాఖ ద్వారా జీవో ఆర్‌టి నెంబర్ 22, తేది 23.02.2015 ను కూడా మీ ప్రభుత్వం జారీ చేసింది. అయితే ఇదంతా జరిగి మూడేళ్లు దాటిపోయినా, మూడు క్రిస్‌మస్‌లు వచ్చిపోయినా ఆ భవన నిర్మాణం జరగలేదు. క్రిస్టియన్ సోదరులకు మీరు ఇచ్చిన హామీ కూడా నెరవేరలేదు. అసలు ఆ భవన నిర్మాణమే ప్రారంభం కాలేదు. ఈ మూడేళ్లలో క్రిస్టియన్ భవన నిర్మాణానికి మీ ప్రభుత్వం ఏం చేసిందో, మీరు ప్రత్యేకంగా నియమించిన కడియం శ్రీహరి కమిటీ ఏం చేసిందో తెలియదు’ అని విమర్శించారు. తక్షణమే ప్రభుత్వం క్రిస్టియన్ భవన్ ను పూర్తి చేసి...వాళ్ళకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.