ఏపీలో శాశ్వత హైకోర్టుకు సమయం పడుతుంది
హైకోర్టు విభజన అంశంపై కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పందించారు. హైకోర్టును తాత్కాలికంగా మార్చగలం కానీ శాశ్వతంగా మార్చడానికి చాలా సమయం పడుతుందని తెలిపారు. అంతవరకు పరస్పరం ప్రేమాభిమానాలతో కలిసి ఉండాలని రెండు రాష్ట్రాలను కోరుతున్నానని తెలిపారు. పదోన్నతులు నిలిపివేయాలన్న విషయంపై తాము ఎలాంటి హామీ ఇవ్వలేమని చెప్పారు. విభజన చేస్తే ప్రస్తుత హైకోర్టు తెలంగాణకు చెందుతుందని తెలిపారు. తాత్కాలికంగా హైకోర్టు ఏర్పాటు చేయడానికి నాలుగు భవనాలు సిద్ధంగా ఉన్నాయని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పారని తెలిపారు. అందులో ఏదో ఒకటి ఖరారు చేయాల్సిందిగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కోరారని వివరించారు. భవనాలు సిద్ధంగా ఉన్న విషయాన్ని ప్రధాన న్యాయమూర్తితో సంప్రదింపులు జరపాలని, న్యాయమూర్తుల నియామకం, పదోన్నతులు తమ పరిధిలోని అంశం కాదని, నియామకలన్నీ కొలీజియమే చేస్తుందని పేర్కొన్నారు.
నాలుగు భవనాలను ఇచ్చేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఏపీ ప్రభుత్వం కూడా ఈ దిశగా ముందుకు రావడం సంతోషం అయితే విభజన జరిగే వరకు న్యాయమూర్తుల పదోన్నతులు చేయవద్దని టీఆర్ఎస్ లోక్ సభాపక్ష నేత జితేందర్ రెడ్డి కేంద్రమంత్రికి విన్నవించారు. హైకోర్టు విభజన ఒక్కటే సమస్య కాదు. విభజన చట్టంలో అనేక పెండింగ్ అంశాలున్నాయని, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాతో పాటు రెవెన్యూ లోటు, ఇంకా చాలా అంశాలు పరిష్కరించాల్సి ఉన్నాయని మరో కేంద్ర మంత్రి సుజనా చౌదరి వ్యాఖ్యానించారు. విభజన సమస్యల పరిష్కారం కోసం రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చుని మాట్లాడుకోవాలని, ఆ సమావేశం ఏర్పాటు చేసేందుకు తాము రెడీగా ఉన్నామని కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు.టీఆర్ఎస్ ఎంపీలు బుధవారం నాడు పార్లమెంట్ లో హైకోర్టును విభజించాలని ఆందోళన చేయటం..అదే రోజు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తాత్కాలిక భవనాలు సిద్ధంగా ఉన్నాయని హైకోర్టు తాత్కాలిక న్యాయమూర్తికి లేఖ రాయటం ఆసక్తికర పరిణామంగా మారింది.