పవన్...సినిమాల్లో మీ ప్యామిలీ ప్యాక్ సంగతేంటి?
పవన్ కు రాజకీయాల్లో వారసత్వాలు నచ్చలేదు. ఓకే అది ఆయన అభిప్రాయం. తప్పు కూడా లేదు. మరి సినీ రంగంలో ముఖ్యంగా టాలీవుడ్ లో వారసత్వాల సంగతేంటి?. సినిమాల్లో మెగా కుటుంబం నుంచే ‘ఫ్యామిలీ’ ప్యాక్ ఉంది కదా?. చిరంజీవి తమ్మడు అయి ఉండకపోతే పవన్ కళ్యాణ్ సినిమా హీరో అయ్యేవాడా?. ఓ సందర్భంలో పవన్ కళ్యాణ్ తనకు అసలు నటనే రాదని చెప్పారు. మరి అసలు నటనే రాని పవన్ కళ్యాణ్ టాలీవుడ్ లో ‘పవర్ స్టార్’ ఎలా అయ్యారు?. చిరంజీవి విషయానికి వస్తే ఆయన ‘స్వయంకృషి’తో పరిశ్రమలో ఎదిగారు. తర్వాత ఆయనకు నటన, డ్యాన్స్ తో పాటు పలు రకాల అంశాలు కలిసొచ్చాయి. చిరు సోదరులుగా ఉన్న నాగబాబు, పవన్ కళ్యాణ్ పరిశ్రమలో అడుగుపెట్టారంటే దానికి చిరంజీవే కారణం కదా?. చిరు తనయుడు రామ్ చరణ్ పరిస్థితి ఏంటి?. మెగా ఫ్యామిలీ ప్యాక్ అంతా ఎక్కడో నైపుణ్యాలు సాధించి పరిశ్రమలోకి వచ్చారా?. రామ్ చరణ్ తొలి సినిమాలో ఏ మాత్రం హావభావాలు ప్రకటించలేకపోయినా..కేవలం మెగా ప్యామిలీ అని..చిరు అభిమానులు ఆదరించలేదా?. ఇప్పుడు కొత్త గా చిరు అల్లుడు కూడా హీరోగా మారబోతున్నట్లు వార్తలు వచ్చాయి ఈ మధ్య. మరి సినిమాల్లో తప్పుకాని వారసత్వాలు రాజకీయాల్లో తప్పు ఎలా అవుతాయి?.
రామ్ చరణ్ కంటే గొప్పగా నటించగల వ్యక్తులు బయట ఎవరూ లేరా?. వారికి అవకాశం వస్తుందా?. పోనీ మెగా ప్యామిలీ అలాంటి వాళ్ళను గుర్తించి ఇప్పటివరకూ ఒక్కరికైనా పరిశ్రమలో అవకాశం కల్పించిందా?. అలాంటి చరిత్ర ఉందా?. అది సినిమా అయినా...రాజకీయాల్లో అయినా ఎవరి రంగాన్ని వాళ్ళు గుప్పిట్లో పెట్టుకుని..తమ కంటే ఎంతో టాలెంట్ ఉన్న వాళ్ళకు కనీసం ఎంట్రీ కూడా లేకుండా చేయటంలేదా?. పోనీ ఎవరైనా అతి కష్టం మీద సినీ పరిశ్రమలోకి ప్రవేశిస్తే...అక్కడ వాళ్ళను నిలదొక్కుకోనిస్తారా?. అంటే దాదాపు అసాధ్యమే అని చెప్పొచ్చు. ఒక్క మెగా ఫ్యామిలీ ప్యాకే కాదు..అటు ఎన్టీఆర్ ఫ్యామిలీ లోనూ అదే పరిస్థితి. అక్కినేని, కృష్ణా కుటుంబాల్లోనూ వారసులదే హవా. అంటే ఈ మూడు, నాలుగు ఫ్యామిలీలు తప్ప...ఉమ్మడి రాష్ట్రంలో సినిమాల్లో రాణించేందుకు అర్హులు ఎవరూ లేరా?. అంటే లేక కాదు...ఎవరి రంగాలను వాళ్ళు కబ్జా చేయబట్టే ఈ పరిస్థితి. కానీ ఎంతసేపు మన తప్పులు వదిలేసి పక్కొడి తప్పులు వెతకటమే ఈజీ ఎవరికైనా?.. పవన్ కళ్యాణ్ పని కూడా అచ్చం అలాగే ఉంది మరి.