Telugu Gateway
Politics

రజనీ..ఇక పొలిటికల్ బాషా

దేవుడు శాసిస్తాడు..రజనీకాంత్ పాటిస్తాడు అంటూ ఇంత కాలం సస్పెన్స్ తో ఉత్కంఠ రేపిన రజనీకాంత్ క్లారిటీగా చెప్పేశాడు. ఈ సినీ బాషా ఇక రాజకీయ బాషాగా మారనున్నాడు. రజనీకాంత్ రాజకీయ ప్రకటనతో 2017 సంవత్సరం చివరి రోజు తమిళ రాజకీయాల్లో ప్రకంపనలు మొదలయ్యాయి. ఈ ప్రభావం ఎవరిపై ఉంటుందా? అన్న అంచనాలు అప్పుడే మొదలయ్యాయి. ఎవరి లెక్కల్లో వాళ్ళు ఉన్నారు. ఇంత కాలం సాగిన అనిశ్చితికి తెరదించుతూ రాజకీయ ప్రవేశంపై చాలా స్పష్టమైన ప్రకటన చేశారు రజనీ. ఆదివారం నాడు అభిమానులతో మాట్లాడుతూ.. తన రాజకీయ ప్రవేశంపై ప్రకటన చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలలోపే సొంతంగా కొత్త పార్టీ స్థాపిస్తానని తెలిపారు. తమిళనాడులోని 234 స్థానాల్లోనూ తమ పార్టీ పోటీ చేస్తుందన్నారు. యుద్ధం చేస్తా, గెలుపోటములు దేవుడి దయ అన్నారు తన సహజశైలిలో.

యుద్ధం చేయకపోతే పిరికివాడు అంటారని పేర్కొన్నారు. డబ్బు కోసమో, పేరు కోసమో రాజకీయాల్లోకి రావడం లేదని.. అవన్నీ తనకు ఇప్పటికీ ఉన్నాయని చెప్పారు. దేశంలో రాజకీయాలు భ్రష్టుపట్టిపోయావని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని రోజులుగా తమిళనాడులో చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు తనకు మనస్తాపం కలిగించాయన్నారు. వ్యవస్థను మార్చే సమయం వచ్చిందని, పార్టీ ఏర్పాటులో అభిమానులదే కీలకపాత్ర అని రజనీకాంత్‌ అన్నారు. తనకు కార్యకర్తలు వద్దని, రక్షకులు కావాలన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడతానని, తనకు తమిళ ప్రజల దీవెనలు కావాలని అభ్యర్థించారు. కొన్ని రాజకీయ పార్టీలు తమిళ రాజకీయాలను భ్రష్టు పట్టించాయని ఆరోపించారు. ఇప్పటికీ తాను రాజకీయాల్లోకి రాకపోతే ప్రజలకు అన్యాయం చేసిన వాడిని అవుతానని అభిప్రాయపడ్డారు.

రాజకీయాలంటే తనకు భయం లేదని, ఎన్నికల యుద్ధానికి సిద్ధమని ప్రకటించారు. రాజకీయాలు చేయడం అంత సులువు కాదని, ‘గెలిస్తే విజయం.. లేదంటే మరణం’ అని వ్యాఖ్యానించారు. సమయం లేకపోవడం వల్ల స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడం లేదన్నారు. కొంత మంది రాజకీయాలు నాయకులు రజనీ ప్రకటనను స్వాగతించగా..మరికొంత మంది సెటైర్లు వేశారు. బిజెపి రాజ్యసభ సభ్యుడు సుబ్రమణ్యస్వామి రజనీ ప్రకటనపై వ్యంగాస్త్రాలు సంధించారు. ప్రతి ఒక్కరూ అవినీతి అని మాట్లాడటం ఫ్యాషన్ అయిపోయిందని ఎద్దేవా చేశారు.

Next Story
Share it