Telugu Gateway
Telugu

కాంగ్రెస్ లో ఇక ‘రాహుల్ రాజ్’

కాంగ్రెస్ పగ్గాలు అమ్మ నుంచి కొడుకు చేతికి వచ్చాయి. డిసెంబర్ 16 నుంచి కాంగ్రెస్ లో రాహుల్ రాజ్ మొదలైంది. కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ పార్టీ సీనియర్ నేతల సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. త్వరలోనే కాంగ్రెస్ లో రాహుల్ మార్క్ కనపడటం ఖాయమని పార్టీ వర్గాలు నమ్మకంతో ఉన్నాయి. మరీ సీనియర్లను పక్కన పెట్టి...కొత్తతరానికి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందని కాంగ్రెస్ నేతలు నమ్ముతున్నారు. అయితే ఇది ఏ మేరకు కార్యరూపం దాల్చుతుందో తెలియాలంటే కొంత కాలం వేచిచూడాల్సిందే. శనివారం న్యూఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో రాహుల్ పార్టీ అధ్యక్ష పదవి చేపట్టారు. ఈ మేరకు కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘం చైర్మన్‌ ముళ్లపల్లి రామచంద్రన్‌ నుంచి అధికారిక సర్టిఫికెట్‌ను ఆయన అందుకున్నారు. సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌, సోదరి ప్రియాంకగాంధీ, కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేతలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో పార్టీ పగ్గాలు చేపట్టిన అనంతరం రాహుల్‌ ప్రసంగించారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా తన తొలి ప్రసంగంలో కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. దేశమంతటా బీజేపీ ప్రభుత్వం హింసాగ్ని రాజేస్తున్నదని మండిపడ్డారు. దానిని ఆర్పివేయడం అంత సాధ్యం కాదన్నారు. దేశ సామరస్యాన్ని మోదీ సర్కారు నాశనం చేస్తున్నదని ధ్వజమెత్తారు. ‘కాంగ్రెస్‌ పార్టీ దేశాన్ని 21వ శతాబ్దంలోకి నడిపించింది.

కానీ ప్రధానమంత్రి దేశాన్ని మధ్యయుగాలనాటికి తీసుకుపోతున్నారు. సామరస్యం లేకపోయినా ఏమీ కాదన్న భావనను బలవంతంగా రుద్దుతున్నారు. ఒక్క వ్యక్తి వ్యక్తిగత ప్రతిష్ట కోసం నైపుణ్యాన్ని, అనుభవాన్ని, జ్ఞానాన్ని అన్నింటిని పక్కనబెడుతున్నారు’ అని రాహుల్‌ విమర్శించారు. దేశాన్ని ముందుకుతీసుకుపోవడానికి బీజేపీతో కలిసి పనిచేసేందుకు సిద్ధమే. కానీ బీజేపీ నమ్మే విలువలతో తాను ఏకీభవించలేనని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ దేశంలో ఆగ్రహావేశపూరిత రాజకీయాలను ప్రేరేపిస్తున్నదని, దీనిపై పోరాడే సత్తా కాంగ్రెస్‌ కార్యకర్తలకు, నేతలకు మాత్రమే ఉందని అన్నారు. సహజంగా ఎవరైనా ప్రజల కోసం రాజకీయాలు చేయాలి.. కానీ నేడు ప్రజల కోసం కాదు వారిని తొక్కేసేందుకు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.

Next Story
Share it