Telugu Gateway
Telugu

కాంగ్రెస్ కొత్త అధ్య‌క్షుడిగా రాహుల్‌..16న బాధ్య‌తల స్వీక‌ర‌ణ‌

అధికారికం. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు అయ్యారు. అంతే కాదు ఈ నెల 16న ఆయ‌న నూత‌న బాధ్య‌త‌లు స్వీక‌రించ‌నున్నారు. రాహుల్ ఏక‌గ్రీవంగా పార్టీ అధ్య‌క్షుడిగా ఎన్నిక అయిన‌ట్లు పార్టీ ఎన్నికల కమిటీ చీఫ్ ఎం. రామచంద్రన్‌ ప్రకటన చేశారు. అధ్యక్ష పదవికి నామినేషన్‌ తిరస్కరణ గడువు సోమవారంతో ముగిసింది. ఈ పదవి కోసం మొత్తం 89 నామినేషన్‌ ప్రతిపాదనలు వచ్చాయని, అయితే రాహుల్‌ మినహా ఎవరూ నామినేషన్‌ వేయకపోవడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. అధ్యక్ష బాధ్యతలు అధికారికంగా ప్రకటించడంతో నెహ్రూ-గాంధీ కుటుంబం నుంచి పార్టీ బాధ్యతలు అందుకోనున్న ఐదో వ్యక్తిగా రాహుల్‌ నిలవనున్నారు. సోనియాగాంధీ, ఇతర సీనియర్‌ నేతల సమక్షంలో 16న ఏకగ్రీవంగా ఎన్నికైన రాహుల్‌కు ఆ ప‌త్రాన్ని అంద‌జేస్తారు.

2004లో రాజకీయాల్లోకి అరంగేట్రం చేసిన రాహుల్‌ అప్పటి నుంచి వివిధ హోదాల్లో పనిచేశారు. 2007లో కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించి యువజన కాంగ్రెస్‌, ఎన్‌ఎస్‌యూఐ సారథ్య బాధ్యతలు చూశారు. 2013లో రాహుల్‌ ఏఐసీసీ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ప్రచార బాధ్యతలను నిర్వర్తించారు. డిల్లీలో కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు. పలువురు సీనియర్‌ నేతలు రాహుల్‌కు అభినందనలు తెలుపుతున్నారు.

Next Story
Share it