Telugu Gateway
Andhra Pradesh

‘పోలవరం’ లో ...సమాధానం లేని ప్రశ్నలు ఎన్నో?

ఆంధ్రప్రదేశ్ కు అత్యంత కీలకమైన పోలవరం ప్రాజెక్టు నిత్యం వివాదాల్లో నలుగుతూనే ఉంది. ఈ మధ్య కాలంలో అది మరింత పెరిగింది. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరం ప్రాజెక్టును కేంద్రానికి వదిలేసి ఉంటే..ఎంత ఖర్చు అయినా..అది లక్ష కోట్లు అయినా...కేంద్ర సర్కారే భరించాల్సి వచ్చేది. కానీ బిజెపి సర్కారు కొత్తగా కొలువుదీరిన తర్వాత 2014 రేట్ల ప్రకారమే తాము పోలవరానికి ఆర్థిక సాయం చేస్తామంటే ఇప్పటివరకూ చంద్రబాబు ఒక్కసారి కూడా అభ్యంతరం చెప్పిన దాఖలాలు లేవు. అసలు జాతీయ ప్రాజెక్టు అన్నాక ఎంత ఖర్చు అయితే అంత భరించాలి కానీ..అందులో బేరాలకు తావు ఎక్కడ ఉంటుంది?.. అయినా సరే ప్రాజెక్టు అమలును తాము కోరినట్లుగా రాష్ట్రానికి అప్పగించంతో చంద్రబాబు అప్పటికి ఆ విషయాలను చాలా సౌలభ్యంగా మర్చిపోయారు. కానీ ఇప్పుడు చంద్రబాబు కేంద్రం తీరుపై ఆవేదన వ్యక్తం చేస్తూ.. సాయం చేయనంటే నమస్కారం పెట్టి తప్పుకుంటాం అని ఓ ప్రకటన చేశారు. అదీ అసెంబ్లీ వెలుపల. పోలవరంపై సమాధానాలు లేని ప్రశ్నలు ఎన్నో?. అవేంటో మీరూ చూడండి.

  1. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు పిలవొచ్చా?. అదీ పోలవరం ప్రాజెక్టు అథారిటీ ( పీపీఏ) అనుమతి లేకుండా?.
  2. స్పిల్ వే, స్పిల్ ఛానల్ లో కొంత భాగం పనులకు టెండర్ పిలిచిన తర్వాతే అంచనా వ్యయం 1395.30 కోట్ల రూపాయల నుంచి 1483 కోట్ల రూపాయలకు ఎలా పెరుగుతుంది?.
  3. పెరిగిన భూ సేకరణ వ్యయం, ప్రాజెక్టు వ్యయం ఇవ్వనన్నా ఎప్పుడూ చంద్రబాబు ఎందుకు ఇప్పటివరకూ అభ్యంతరం చెప్పలేదు.
  4. కొత్త పనుల వ్యయం రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సిన అవసరం ఎందుకొచ్చింది?. ఇంకా రాష్ట్రంపై పడే అదనపు భారం సంగతి ఏమిటి?.
  5. జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరం వ్యయం పూర్తి బాధ్యత కేంద్రానిదే కదా? విభజన చట్టంలోనే ఈ విషయం ఉంది.
  6. ఒక్క టెండర్ ను కొన్ని రోజులు ఆపేయమంటేనే ఎందుకింత ఉలికిపాటు?.
  7. కేంద్రం ఆపమన్నా ఆగకుండా టెండర్ విషయంలో ముందుకు సాగాలనే నిర్ణయం తీసుకోవటం వెనక మతలబు ఏమిటి?.
  8. సోమవారం పేరు ‘పోల’వారంగా మార్చి అంతా అయిపోయింది అంటూ నమ్మించి..ఇప్పుడు కేంద్రం అడ్డుపడుతుందని చెప్పటం వెనక కారణాలేంటి?.
  9. పోలవరం ప్రాజెక్టు విషయంలో చట్టబద్దంగా ఉన్న హక్కును ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా పోరాడి సాధించుకోలేకపోతుంది?
  10. పోలవరం పూర్తయ్యే వరకూ అంటూ వేల కోట్ల రూపాయలు పెట్టి పట్టిసీమ, పురుషోత్తపట్నం ప్రాజెక్టులు కడుతున్నప్పుడు ఒకట్రెండు సంవత్సరాలు పోలవరం జాప్యం అయితే వచ్చే నష్టం ఏంటి?.
  11. కేంద్రానికే పోలవరాన్ని మొదట్లోనే వదిలేసి ఉంటే..కష్టాల్లో ఉన్న రాష్ట్రంపై అసలు భారమే ఉండేది కాదు కదా?.
  12. కమిషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వమే పోలవరం అమలు బాధ్యత తీసుకుని..ఇప్పుడు ఓ టెండర్ విషయంలో కేంద్రం అభ్యంతరం చెప్పగానే ఎందుకింత రాద్దాంతం చేస్తోంది?
  13. అడిగి తీసుకుని ...ఇప్పుడు బ్లెయిమ్ ను బిజెపి పై నెట్టేందుకు ఎత్తుగడ వేస్తున్నారా?.
  14. చట్టబద్దంగా వంద శాతం పోలవరం ఖర్చు మీరే భరించాలి అని చంద్రబాబు ఎందుకు డిమాండ్ చేయరు?.
  15. ప్రత్యేక హోదా విషయంలో ఎలాగూ రాజీపడ్డారు కదా?. పోలవరం లోఅయినా న్యాయయం చేయమని కేంద్రాన్ని గట్టిగా అడగొచ్చు కదా?. ఆ పని ఛంద్రబాబు ఎందుకు చేయటం లేదు?.

Next Story
Share it