Telugu Gateway
Andhra Pradesh

పవన్ కళ్యాణ్ ‘మూడు విడతల’ పర్యటన

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజాక్షేత్రంలోకి దూకాలని నిర్ణయించుకున్నారు. దీనికి సంబంధించి కీలకమైన ప్రకటన విడుదల చేశారు. తొలుత పవన్ కళ్యాణ్ విజయనగరం జిల్లాలో వెంకటేష్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు. వాస్తవానికి ఉస్మానియా యూనివర్శిటీలో మృతి చెందిన మురళీ కుటుంబాన్ని పరామర్శించాల్సి ఉన్నా...పోలీసుల ఆంక్షలు అడ్డంకిగా ఉన్నాయని తెలిపారు. కృష్ణా నదిలో జరిగిన పడవ ప్రమాదంలో అశువులు బాసిన వారి కుటుంబాలను పరామర్శించటం తన విధిగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలలో మూడు విడతలుగా పర్యటించాలని నిర్ణయించారు. ఈ మేరకు మూడు పేజీల లేఖను పవన్ విడుదల చేశారు. ఈ యాత్రకు "చలోరే చలోరే చల్‌"గా నామకరణం చేశారు.

మొదటి విడతలో "సమస్యల పరిశీలన, అధ్యయనం, అవగాహన" కార్యక్రమాలు ఉంటాయని. రెండవ విడతలో "సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ చిత్తశుద్ధి ఉంటే సరి లేదా గుర్తు చేస్తాము" అని ప్రకటించారు. మూడవ విడతలో "సమస్యలు పరిష్కారం కాకుంటే పర్యటనను పోరాట వేదికగా మారుస్తాము" అని పవన్ వెల్లడించారు. రెండు రాష్ట్రాల్లోని యువత నిరాశ నిస్పృహలతో ఉన్నారని అది దేశానికి క్షేమకరం కాదన్నారు. ఈ అంశాన్ని ప్రధానంగా తీసుకుని పవన్ ముందుకు సాగనున్నట్లు తెలిపారు. పవన్ తన యాత్రకు ముందు ఓ పాటను విడుదల చేశారు.

Next Story
Share it