Telugu Gateway
Andhra Pradesh

జగన్ పై ‘పవన్ పంచ్ లు’

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం నాడు ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డిపై పంచ్ లు వేశారు. ప్రజలు ఏదైనా సమస్యను ప్రస్తావిస్తే నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత చేస్తానని అనటం సరికాదని..ఇది తనకు నచ్చదు అని వ్యాఖ్యానించారు. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (డీసీఐ) ఉద్యోగులకు వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మద్దతు ప్రకటించాలని పవన్ కోరారు. అదే సమయంలో ప్రధాని మోడీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడులు ఏమీ తన బంధువులు కాదని వ్యాఖ్యానించారు. ప్రజలే తన బంధువులు అని తెలిపారు. నిర్మాణాత్మక రాజకీయాలు చేసేవారికే తన మద్దతు ఉంటుందని అన్నారు. పదవి లేకపోయినా ప్రజాసమస్యలపై పోరాటమే తన ధ్యేయమన్నారు. దెబ్బలు తిన్నవారు ఎదురుతిరిగితే ఎలా ఉంటుందో చూపిస్తా అని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం డీసీఐని ప్రైవేటీకరించాలని చూస్తోంది. ప్రత్యేక హోదాను సాగదీస్తోంది. ఇలాగే కొనసాగితే విశాఖ స్టీల్, ఎయిర్ ఇండియాలను కూడా ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తారని పవన్ వ్యాఖ్యానించారు.

జనసేన ప్రజల పార్టీ అని ..ఈ పార్టీకి కులాలు..మతాలు ఉండవన్నారు. ప్రజలకు నష్టం కలిగించే ఏ పార్టీకి మద్దతు ఇవ్వను అని ప్రకటించారు. 2019లోనే ఎన్నికలు వస్తున్నాయనే విషయాన్ని ప్రస్తుత పార్టీలు మర్చిపోకూడదని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. ప్రజలను పట్టించుకోకపోతే వారే తగిన గుణపాఠం చెబుతారని అన్నారు.డ్రెడ్జింగ్ కార్పొరేషన్ అంశంపై ఇఫ్పటికే ప్రధాని మోడీకి లేఖ రాశానని..తన లేఖను ఆయన పరిశీలిస్తారో లేదో చూడాల్సి ఉందన్నారు. ఈ సమస్య పరిష్కరించకపోతే బిజెపి ఓటమి విశాఖ నుంచే మొదలవుతుందని వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తున్న సమయంలో కొంత మంది అభిమానులు సీఎం..సీఎం అంటూ నినాదాలు చేయటంతో ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇతరులు చేసే తప్పే మీరూ చేయకండి..అధికారానికి అనుభవం కావాలి అని వ్యాఖ్యానించారు. తాను తలుచుకుంటే ఎక్కడ నుంచి అయినా పోటీచేసి గెలుస్తానని..తనకు పదవులు ముఖ్యంకాదని వ్యాఖ్యానించారు.

Next Story
Share it