Telugu Gateway
Andhra Pradesh

‘పవన్’ను టైమ్ మెషిన్ లో తీసుకురావాలేమో!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంత కాలం ‘పార్ట్ టైమ్’ పాలిటిక్సే చేస్తారనుకున్నారు. కానీ ఆయన తాజా ఏపీ పర్యటన చూస్తుంటే పార్ట్ టైమ్ పాలిటిక్సే కాదు...చాలా పాత పాలిటిక్స్ చేస్తారేమో అన్పించేలా ఉన్నాయి ఆయన వ్యాఖ్యలు. ప్రస్తుత కాలానికి పవన్ కళ్యాణ్ ను టైమ్ మెషిన్ లో తీసుకు రావాలేమో అని ఓ టీడీపీ సీనియర్ నేత వ్యాఖ్యానించారు. ఎప్పటి ‘తమ్ముడు’ సినిమా...ఎప్పుడు పరిటాల రవి గుండు కొట్టించారనే ప్రచారం. సరిగ్గా 18 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనను ఆయన ఇప్పుడు మరోసారి అందరికీ గుర్తు చేశారు. ఆ ప్రచారం చేసింది టీడీపీ వాళ్లేనంట. ఈ విషయం చెప్పింది కూడా పవన్ కళ్యాణే. ఇవన్నీ మనసులో పెట్టుకోకుండా గత ఎన్నికల్లో టీడీపీకి మద్దతు ఇచ్చారని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అసలు ప్రజారాజ్యం పార్టీ గురించి ఆ పార్టీ పెట్టిన చిరంజీవే మర్చిపోయి ఉంటారు?. ఎందుకంటే ఎప్పుడో దాన్ని కాంగ్రెస్ లో కలిపేశారు కాబట్టి. కానీ పవన్ కళ్యాణ్ జనసేన పేరుతో పార్టీ పెట్టి... ఇప్పుడు పాత పార్టీ ‘ప్రజారాజ్యం’ పార్టీకి సంబంధించి పాత పగల అంశాన్ని ప్రస్తావిస్తున్నారు.

ప్రజారాజ్యంలో చిరంజీవికి అన్యాయం చేసిన వారిని వదిలిపెట్టనని..అందరిని గుర్తుపెట్టుకుంటానని వ్యాఖ్యానించారు. అదే సమయంలో అప్పట్లో ప్రజారాజ్యం పార్టీలో ఉంటూ..అదే పార్టీ ఆఫీసులో కూర్చుని చిరంజీవిపై తీవ్ర విమర్శలు చేసిన అప్పటి ప్రజారాజ్యం నాయకుడు పరకాల ప్రభాకర్ పై పవన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోయిన పరకాల భార్య నిర్మలా సీతారామన్ కేంద్ర మంత్రి పదవిలో ఎలా కొనసాగుతున్నారని ప్రశ్నించారు. అంతే కాదండి బాబోయ్ పవన్ కళ్యాణ్ ఎప్పుడు పెద్దవాడిగా మారిపోతారో..ఎప్పుడు చిన్నవాడిగా మారపోతారో ఎవరికీ అర్థం కాకుండా ఉంది. ఒకప్పుడు అసలు తనను మించిన ‘ప్రత్యేక హోదా ఛాంపియన్’ ఎవరూ లేరన్న తరహాలో హోదా ఉద్యమ షెడ్యూల్ ప్రకటించి..దాన్ని మద్యలోనే వదిలేశారు. ఇప్పుడేమో ప్రత్యేక హోదా గురించి మాట్లాడటానికి తాను చాలా చిన్నవాడిని అని ..తనకంటే చాలా పెద్ద వాళ్లు ఉన్నారని వ్యాఖ్యానించారు. మరి హోదా ఉద్యమ షెడ్యూల్ ప్రకటించిన సమయంలో పవన్ కళ్యాణ్ పెద్దగా ఉన్నారా?.లేక చిన్నగా ఉన్నారో ఆయనకే తెలియాలి.

గత ఎన్నికల్లో బిజెపి-టీడీపీకి పవన్ కళ్యాణ్ బహిరంగ మద్దతు ఇవ్వటమే కాకుండా..వాళ్ల కోసం ప్రచారం కూడా చేశారు. అది ఆయన ఇష్టం. అందులో అభ్యంతరం చెప్పాల్సింది ఏమీలేదు. బిజెపి-టీడీపీ కూటమికి మద్దతు ఇచ్చారంటే సహజంగానే వైసీపీకి..జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకం అన్నట్లే కదా?. అందులో ప్రత్యేకంగా చెప్పాల్సింది కాదు. కానీ ఆయన మద్దతు ఇచ్చిన పార్టీలు అధికారంలోకి వచ్చి నాలుగేళ్ళు పూర్తి కావస్తున్న తరుణంలో 2014లో తాను మద్దతు ఇవ్వటానికి గల కారణాలు తెలపటంలో ఎలాంటి ఔచిత్యం కన్పించదు. ఓ సారి పోలవరం విషయంలో అవినీతి జరిగిందని బహిరంగంగా ప్రకటించారు. మరో వైపు చంద్రబాబుపై నమ్మకం ఉంది ప్రాజెక్టు పూర్తి చేస్తారు అంటారు. జగన్ పై వచ్చిన అవినీతి ఆరోపణలు బహిరంగ రహస్యం. అందులో కొత్తగా పవన్ కళ్యాణ్ కనిపెట్టింది ఏమీ లేదు. ఎవరైనా ప్రస్తుత ప్రభుత్వంలో జరిగే అక్రమాలు..అవినీతిపై పోరాటం చేస్తారా? లేక ప్రతిపక్ష అవినీతిపై పోరాటం చేసి..అధికార పార్టీ అవినీతికి కొమ్ముకాస్తారా?.

ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వం ఇసుక దగ్గర నుంచి మొదలుపెడితే సాగునీటి ప్రాజెక్టులు...పరిశ్రమలు...అమరావతి పేరుతో అడ్డగోలు దోపిడీకి పాల్పడుతోందనే విమర్శలు విన్పిస్తున్నాయి. కానీ పవన్ కళ్యాణ్ చాలా కన్వీనెంట్ గా వాటిని వదిలేశారు. పోలవరం విషయంలో పవన్ కళ్యాణ్ డిమాండ్లపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పెద్ద కామెడీనే చేశారు. కేంద్రం అడిగిన ప్రశ్నలకు సమాధాన చెప్పాలని...పోలవరంపై శ్వేతపత్రం ప్రకటించి..అఖిలపక్షం పెట్టాలని పవన్ డిమాండ్ చేస్తే సీఎం చంద్రబాబు దాన్ని చాలా లైట్ గా తీసుకుని..పవన్ కళ్యాణ్ పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలని కోరుకుంటున్నారని..వైసీపీ మాత్రం ప్రాజెక్టు అడ్డుకోవటానికి ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. పోలవరం విషయంలో పవన్, వైసీపీ ఇద్దరి డిమాండ్లు ఒక్కటే...కానీ ఇద్దరిలో పవన్ ను చంద్రబాబు ట్రీట్ చేసే విధానమే వేరు. సినిమాల్లో కూడా పాత కథ అయితే అది అట్టర్ ఫ్లాప్ అవుతుంది. 25 సినిమాలు చేసిన హీరోగా..రాజకీయవేత్తగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇంకా పాత విషయాలు చెబుతూ ఉంటే ఎలా? అన్నదిే ఇప్పుడు చర్చ.

Next Story
Share it