Telugu Gateway
Telugu

నేను వస్తే...పవన్ కళ్యాణ్!

ట్విట్టర్ లీడర్..అదేనండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ మధ్య ఓ ప్రకటన ఇచ్చారు. అదీ ట్విట్టర్ లోనే లేండి. అదేంటి అంటే.. ‘నేను వస్తే విశాఖపట్నంలో ప్రభుత్వ అధికారులపై విపరీతమైన ఒత్తిడి పడుతుంది. అందుకే నేను రావటంలేదు. ఈ లోగానే సమస్య పరిష్కరించండి‘ అని ఏపీ ప్రభుత్వాన్ని కోరాడు.’. విశాఖలో ఈ మధ్య ఓ మహిళపై దాడి చేసిన ఘటన దృశ్యాలు మీడియాలో హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడి చేసింది అధికార తెలుగుదేశం నాయకులు అనే ఆరోపణలు వెల్లువెత్తాయి. పవన్ ట్వీట్ ను ప్రభుత్వం ఎక్కడా పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. అంటే మరి పవన్ విశాఖ పర్యటన చేసి ఒత్తిడి పెంచి..సమస్య పరిష్కారానికి చూస్తారా? లేక పాత హామీల తరహాలోనే దీన్ని వదిలేస్తారా?. పవన్ గతంలో పలు హామీలను ఇలాగే వదిలేశారు. ఏపీ నూతన రాజధాని ప్రాంతం అమరావతిలో తొలిసారి పర్యటించిన సమయంలో పవన్ కళ్యాణ్ తాను రైతుల పక్కన నిలబడతానని..బలవంతంగా భూ సేకరణ చేస్తే రైతుల తరపున తాను నిలబడి పోరాడతానని ప్రకటించారు.

తీరా ఈ మధ్యే సర్కారు సుమారు 1300 ఎకరాల భూ సేకరణకు నోటిఫికేషన్ జారీ చేసింది. దీనిపై ప్రస్తుతం ఈ ట్విట్టర్ లీడర్ ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడటం లేదు. ఇదే కాదు..పశ్చిమ గోదావరి జిల్లాలోని తుందుర్రు లో ప్రతిపాదించి గోదావరి మెగా ఆక్వా పార్క్ విషయంలోనూ అదే జరిగింది. పవన్ హెచ్చరికలను ఏ మాత్రం పట్టించుకోని సర్కారు తన పని తాను చేసుకుంటూ పోతోంది. అప్పటికప్పుడు అలా హామీలు ఇవ్వటం ..తర్వాత మర్చిపోవటం పవన్ కు చాలా కామన్ అయిపోయిందనే విమర్శలు విన్పిస్తున్నాయి. అంతే కాదు..ప్రత్యేక హోదా అంశం మంచి పీక్ లో ఉన్నప్పుడు తానే ముందుండి నడిపిస్తానని..అన్ని జిల్లాల్లో సభలు నిర్వహిస్తానని ప్రకటించి..ఇప్పుడు యువత ముందుకు రావాలని..టీడీపీ, వైసీపీ తన పోరాటానికి మద్దతు ఇవ్వాలని కోరటంపై రాజకీయ వర్గాల్లో విస్మయం వ్యక్తం అవుతోంది. అసలు హోదా ఏమీ సంజీవని కాదు..ప్యాకేజే బెస్ట్ అన్న ఏపీ ప్రభుత్వాన్ని మాత్రం ఒక్క మాట అనరు. తాజాగా పవన్ కళ్యాణ్ ఫాతిమా మెడికల్ కళాశాల విద్యార్థుల సమస్యను లేవనెత్తారు. ప్లీజ్ ..విద్యార్ధుల సమస్యలు పరిష్కరించాలని ట్విట్టర్ లో కోరారు.

Next Story
Share it