లోకేష్..జగన్ లపై పవన్ సంచలన వ్యాఖ్యలు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బుధవారం నాడు విశాఖపట్నంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. అటు ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డితోపాటు..ఏపీ మంత్రి నారా లోకేష్ పైనా వ్యంగాస్త్రాలు సంధించారు. జనసేన కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. యువత అంటే జగన్..లోకేష్ లు కాదని, ప్రజలు అని వ్యాఖ్యానించారు. లోకేష్ సామర్థ్యం ఎంతో వాళ్ల నాన్న చంద్రబాబుకే తెలియాలని..తనకు ఏమీ తెలియదని అన్నారు. రాజశేఖర్ రెడ్డి చనిపోగానే జగన్ సీఎం కావాలనుకోవటం సరికాదని..అందుకే తాను ఆయనకు మద్దతు ప్రకటించలేదన్నారు. వారసులు ఎవరైనా సమర్థత నిరూపించుకున్నాకే రాజకీయాల్లోకి రావాలని పవన్ వ్యాఖ్యానించారు. రాజశేఖరరెడ్డి చేసిన మంచి పనులూ ఉన్నాయి..అవినీతి ఉందని పవన్ అన్నారు. అధికారపక్షం ఓ లక్ష కోట్ల అవినీతి, ప్రతిపక్షం ఓ లక్ష కోట్ల అవినీతి చేస్తే ప్రజలకు ఏమి ఇస్తారని ప్రశ్నించారు. చూస్తుంటే ఇద్దరూ దొంగల్లాగే ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. మార్పు కోసం చిరంజీవి కొంత ప్రయత్నం చేశారని..ఆయనకు కొంత మంది ద్రోహం చేశారని అన్నారు.
చిరంజీవికి ద్రోహం చేసిన వారి పని చెబుతానని అన్నారు. నా తండ్రి సీఎం అయితే నేను సీఎం కావాలనుకోవటం తప్పన్నారు. రాజులు మారారు కానీ దోపిడీ అలాగే ఉందన్నారు. తెలంగాణలోనూ ఆంధ్రా కాంట్రాక్టర్లే పనులు చేస్తున్నారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతామని తెలిపారు. వేల కోట్ల రూపాయల దుర్వినియోగం జరుగుతున్నట్లు ఉందని అన్నారు. సినిమా తనకు అన్నం పెట్టిందని..రాజకీయాల్లోకి రావాలని 2003లోనే అమ్మా నాన్నతో చెప్పినట్లు వెల్లడించారు. నా మనస్సాక్షికి సమాధాన చెప్పుకునేందుకు రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. లాల్ బహదూర్ శాస్త్రి, సర్దార్ పటేల్, నెహ్రు, అంబేద్కర్ లే తనకు స్పూర్తి అన్నారు. రాజకీయాలు బాగుంటే తాను సినిమాలు వదిలి వచ్చేవాడిని కాదన్నారు.