పద్మావతి సినిమాకు సెన్సార్ బోర్డు ఓకే!
ఎట్టకేలకు పద్మావతి సినిమా విడుదలకు మార్గం సుగమం అయింది. కేంద్ర సెన్సార్ బోర్డు ఈ సినిమా విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 28న జరిగిన సమావేశంలో పద్మావతి సినిమాకు ఆమోదముద్ర వేశారు. దీంతో దేశంలో పెద్ద చర్చకు దారితీసిన..తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న ఈ సినిమా త్వరలోనే థియేటర్లలో సందడి చేయనుంది. అయితే ఈ సినిమాలో ఓ పాటను మార్చాలని సెన్సార్ బోర్డు సూచించినట్లు సమాచారం. పద్మావతి సినిమాలో చరిత్రను వక్రీకరించారని..రాజ్ పుత్ రాణి పద్మావతి ని అవమానించేలా సన్నివేశాలు ఉన్నాయనే అనుమానంతో ముఖ్యంగా రాజస్థాన్ లో ఆందోళనలు చెలరేగిన విషయం తెలిసిందే. తర్వాత ఇది ఇతర రాష్ట్రాలకు కూడా పాకింది. దేశంలో పెద్ద దుమారం రేపిన సినిమాల్లో పద్మావతి ఒకటి. ఈ సినిమా వివాదం కొద్ది రోజుల పాటు పెద్ద చర్చను లేవదీసింది.
ఇది రాజకీయ రంగు పులుముకోవటంతో సుప్రీంకోర్టు కూడా కొంత మంది ముఖ్యమంత్రులపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. మొదటి నుంచి పద్మావతి సినిమాలో చరిత్రను ఏ మాత్రం వక్రీకరించలేదని..అంతా సవ్వంగానే ఉందని చిత్ర దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ పలు మార్లు ప్రకటించారు. అయినా ఆయన మాటలను ఎవరూ పట్టించుకోలేదు. చివరకు కేంద్ర సెన్సార్ బోర్డు మాత్రం సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఈ సినిమాలో పద్మావతి లీడ్ రోల్ పోషించిన హీరోయిన్ దీపికా పడుకొనే కూడా తీవ్ర బెదిరింపులను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆమె ముక్కు కోసం ఇచ్చిన వారికి కొంత మంది బహుమానాలు కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. సినిమా విడుదలకు క్లియరెన్స్ రావటంతో ఇక చిత్ర యూనిట్ విడుదల తేదీని ప్రకటించమే మిగిలింది. అయితే సెన్సార్ బోర్డు సినిమా పేరు మార్చటంతోపాటు..పలు షరతులు పెట్టినట్లు సమాచారం. దీనిపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తుందో వేచిచూడాల్సిందే.