ఉస్మానియాలో విద్యార్థి ఆత్మహత్య..కెసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు
ఉస్మానియా యూనివర్శిటీలో కలకలం. హాస్టల్ లోని ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకోవటంతో ఒక్కసారిగా కలకలం రేగింది. యూనివర్సిటీలోని మానేర్ హాస్టల్ బాత్రూమ్‌లో పీజీ విద్యార్థి మురళీ ఉరేసుకుని బలవన్మరణం చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఓయూ హాస్టల్‌కు చేరుకుని పరిశీలిస్తున్నారు. విద్యార్థి మురళీ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించే యత్నం చేయగా పోలీసులతో విద్యార్థులు వాగ్వివాదానికి దిగారు. 50 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించిన తర్వాతే మృతదేహన్ని తరలించాలని విద్యార్ధులు డిమాండ్ చేస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి మురళీ ఎంఎస్సీ ఫిజిక్స్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. మృతుడి స్వస్థలం సిద్దిపేట్ జిల్లా అని చెబుతున్నారు. తోటి విద్యార్థి, మిత్రుడు బలవన్మరణాన్ని జీర్ణించుకోలేని వర్సిటీ విద్యార్థులు ఆందోళన చేపట్టారు.
తెలంగాణ సీఎంకు వ్యతిరేకంగా కేసీఆర్ డౌన్‌డౌన్ అంటూ విద్యార్ధులు నినాదాలు చేస్తున్నారు. వర్సిటీ విద్యార్థులతో పోలీసులు చర్చలు జరుపుతున్నారు. ఓ వైపు ఉస్మానియా యువత ఎప్పటి నుంచో సర్కారు తీరుపై తీవ్ర అసంతృప్తిగా ఉంది. ముఖ్యంగా ఉద్యోగాల నోటిఫికేషన్లకు సంబంధించి సర్కారు తీరును నిరుద్యోగ యువత తప్పుపడుతోంది. జెఏసీ ఓ వైపు సోమవారం నాడు కొలువుల కొట్లాట పెట్టిన తరుణంలో ఈ ఆత్మహత్య జరగటం కలకలం రేగుతోంది. విద్యార్థి రూమ్ లో సూసైడ్ నోట్ కూడా లభ్యం అయినట్లు విద్యార్ధులు చెబుతున్నారు. అన్నకు లేఖ రాసి..మురళీ ఆత్మహత్యకు పాల్పడ్డారు. అమ్మా ఐ మిస్ యూ అంటూ సూసైడ్ నోట్ లో మురళీ పేర్కొన్నారు. పరీక్షలు అంటే భయపడుతున్నానని..మరికొన్ని రోజులు ఇక్కడే ఉంటే పిచ్చివాడిని అయిపోతా? అని లేఖలో పేర్కొన్నట్లు చెబుతున్నారు.