Telugu Gateway
Telangana

తెలుగు మహాసభల్లో ‘జాతీయ గీతమే’!

తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా జరగనున్న తెలుగు మహాసభలకు సంబంధించి ఓ వైపు ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేస్తుంటే ...మరో వైపు విమర్శలూ అదే స్థాయిలో వస్తున్నాయి. ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ గతంలో తెలుగుతల్లి ఎవరి తల్లి..ఎవరికి తల్లి అంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు కెసీఆర్ క్షమాపణలు చెప్పాలని బిజెపి సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డి డిమాండ్ చేశారు. ఈ మహాసభల కోసం సిద్ధం చేసిన తోరణాల్లో తెలుగుతల్లి ఫోటోను కాకుండా...గతంలో టీఆర్ఎస్ తయారు చేయించిన తెలంగాణ తల్లి ఫోటోనే వాడుతున్నారు. ఇదిలా ఉంటే..ఈ మహా సభల ప్రారంభంలో మా తెలుగు తల్లికి మల్లె పూ దండ పాట పాడతారా?.లేక జయ జయహే తెలంగాణ పాట పాడుతారా? అన్న చర్చ సాగుతోంది.

అయితే ఈ రెండు పాటలను పక్కన పెట్టి కేవలం జాతీయ గీతంతోనే సభలను ప్రారంభిస్తారని..మరే గీతం ప్రారంభ సభల్లో ఉండదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. మా తెలుగు తల్లి..జయ జయహే పాటల్లో ఏది పాడినా వివాదస్పదం అయ్యే అవకాశం ఉన్నందున ఈ రెండింటిని పక్కన పెట్టి జాతీయ గీతంతో ఈ వివాదానికి పుల్ స్టాప్ పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ నెల 15న హైదరాబాద్ లో ఈ ప్రపంచ తెలుగు మహాసభలు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. నేతల సంగతి ఎలా ఉన్నా..రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన కవులు హాజరుకానున్నందున..పైగా పేరు కూడా తెలుగు ప్రపంచ మహాసభలు అని పెట్టినందున సాధ్యమైనంత వరకూ వివాదాలు లేకుండా చేయటానికే ప్రాధాన్యత ఇస్తున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.

Next Story
Share it