ఆధార్ అనుసంధానం పై ఫేస్ బుక్ వివరణ
ఫేస్ బుక్ ఖాతా ఓపెన్ చేయటానికి తాము ఆధార్ వివరాలు అడగటంలేదని ఫేస్ బుక్ స్పష్టం చేసింది. గత రెండు రోజులుగా దీనికి సంబంధించిన పలు వార్తలు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేశాయి. ఇక ఫేక్ అకౌంట్లు అన్నీ కనుమరుగు అవుతాయని..కొత్తగా ఎవరూ దొంగ పేర్లతో అకౌంట్ తెరవలేరని పేర్కొన్నారు. అయితే ఆ ప్రచారం అంతా బోసగ్ అని తేలిపోయింది. భారత్‌లో యూజర్ అకౌంట్లను ఆధార్‌తో లింక్ చేయడం లేదని ఫేస్‌బుక్ స్పష్టత ఇచ్చింది. తాము ఆధార్ డేటాను సేకరించడం లేదని, ఫేస్‌బుక్‌లోకి సైన్-అప్ అయ్యేటప్పుడు ఆధార్ నెంబర్‌ను యూజర్లు నమోదుచేయాల్సినవసరం లేదని పేర్కొంది.
అదే సమయంలో యూజర్లు తమ అకౌంట్లకు ఆధార్ కార్డుపై ఉన్న పేరును వాడితే బాగుంటుందని సూచించింది. దీంతో తమ ప్లాట్‌ఫామ్‌పై యూజర్లను మీ స్నేహితులు, కుటుంబ సభ్యులు తేలికగా కనుగొనవచ్చన్నారు. ''మేము పరీక్షిస్తున్న వాటిలో ఇది ఆప్షనల్. ఆధార్ కార్డుపై ఉన్న పేరును నమోదుచేయాల్సినవసరం లేదు. ఆధార్‌తో ఎలాంటి ప్రమాణీకరణ లేదు'' అని కంపెనీ తన బ్లాగ్ పోస్టులో పేర్కొంది. దీంతో ఫేస్ బుక్ ఖాతాదారుల్లో నెలకొన్న అనుమానాలు అన్నీ పటాపంచలు అయ్యాయి. నిజానికి ఫేస్ బుక్ కనుక ఆధార్ తో ఖాతాలను అనుసంధానం తప్పనిసరి చే్స్తే కోట్ల సంఖ్యలో బోగస్ ఖాతాలు ఎగిరిపోయే అవకాశం ఉంది.