Telugu Gateway
Telugu

రాహుల్ చేతికి కాంగ్రెస్ పగ్గాలు..ప్రకటన లాంఛనమే

రాహుల్ గాంధీ... కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నిక కావటం పూర్తిగా లాంఛనమే. దేశంలోని అతి పురాతన పార్టీ అయిన కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ ఎన్నికకు మార్గం సుగమం అయింది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన సోమవారం సాయంత్రానికే వెలువడే అవకాశం ఉంది. ఆయన సోమవారం ఉదయమే ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో అధ్యక్ష పదవికి నామినేషన్‌ దాఖలు చేశారు. మాజీ ప్రధాని మన్మోహాన్‌ సింగ్‌, పలువురు సీనియర్‌ నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. రాహుల్‌ గాంధీ పేరును ప్రస్తుత అధినేత్రి సోనియా గాంధీ, మాజీ ప్రధాని, సీనియర్‌ నేత మన్మోహాన్‌ సింగ్‌ ప్రతిపాదించారు. షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 17న పోలింగ్‌, 19న ఓటింగ్‌ నిర్వహించాల్సి ఉంది.అధ్యక్ష పదవికి ఎవరూ పోటీ పడకపోవటంతో ఈ సాయంత్రమే రాహుల్‌ పేరును అధ్యక్షుడిగా అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని ఏఐసీసీ వర్గాలు వెల్లడించాయి.

నాలుగు సెట్ల రాహుల్‌ నామినేషన్‌ పత్రాలపై 40 మంది నేతలు సంతకాలు చేయగా.. రాహుల్‌ను ప్రతిపాదిస్తూ 93 నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రతీ రాష్ట్రం నుంచి ఆయనకు మద్దతుగా నామినేషన్లు దాఖలయ్యాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేతలు అందరూ ఢిల్లీలోని మకాం వేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రస్తుతం రాహుల్ కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడి పదవిలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. నెహ్రూ కుటుంబం నుంచి అధ్యక్ష బాధ్యతలను స్వీకరించే వారి జాబితాలో రాహుల్‌ చేరబోతున్నాడు. ఇక అత్యధిక కాలం ఏఐసీసీ అధ్యక్షురాలిగా పని చేసిన రికార్డు సోనియా గాంధీ(దాదాపు 20 ఏళ్లు) పేరిట ఉంది. నామినేషన్‌ వేసిన అనంతరం కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మోహసినా కిద్వాయ్, షీలా దీక్షిత్ లాంటి కురువృద్ధ నేతలతో రాహుల్‌ కాసేపు మాట్లాడారు.

రాహుల్‌ గాంధీ ప్రధాని అభ్యర్థిత్వానికి సరైన వ్యక్తి అని ఈ సందర్భంగా పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరిందర్‌ సింగ్‌ అభిప్రాయం వ్యక్తంచేశారు. పలువురు సీనియర్‌ నేతలు రాహుల్‌కు మద్దతుగా ట్వీట్లు చేస్తున్నారు. గత కొంత కాలంగా రాహుల్ తన శైలిని మార్చుకుని ప్రత్యర్థి పార్టీలపై విమర్శలు ఎక్కుపెట్టడంలో సక్సెస్ అవుతున్నారు. అయినా అప్పుడప్పుడు తప్పటడుగులు పడుతూనే ఉన్నాయి. అధ్యక్షుడిగా మారిన తర్వాత రాహుల్ వైఖరిలో ఎలాంటి మార్పు వస్తుందో వేచిచూడాల్సిందే అని పార్టీ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. అయితే రాహుల్ అధికారికంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశమంతటా యూత్ కు ప్రాధాన్యత ఇవ్వటంతో పాటు..పెద్దతరం నేతలు..యువతరం మధ్య సయోధ్య ఉండేలా సన్నాహాలు చేస్తున్నారని..అయితే ఈ పోరాటంలో ఎవరిది పైచేయి అవుతుందో ఇప్పుడే చెప్పటం కష్టం అని ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు.

Next Story
Share it