గుజరాతీల ‘మనసు గెలుచుకున్న మోడీ’
ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి గుజరాతీల మనసు గెలుచుకున్నారు. ప్రధానిగా ఉండి కూడా ముఖ్యమంత్రి తరహాలో గుజరాత్ ఎన్నికలు అన్నీ తానై ఒంటి చేత్తో ప్రచారం నిర్వహించారు. మోడీ ప్రచారంపై విమర్శలు కూడా అదే తరహాలో వెల్లువెత్తాయి. ప్రధాని హోదాను దిగజార్చారని..ఏకంగా భారత్ ఎన్నికల్లో పాకిస్తాన్ జోక్యం చేసుకుంటుందనే ఆరోపణలు చేసిన మోడీపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విమర్శల సంగతి ఎలా ఉన్నా..సొంత రాష్ట్రంలో మరోసారి విజయాన్ని దక్కించుకోవటం ద్వారా మోడీ తన సత్తాకు తిరుగులేదని నిరూపించుకున్నారు. దీంతో మరికొంత కాలం ఢిల్లీలో ఆయన హవా కొనసాగే అవకాశం కన్పిస్తోంది. వచ్చే పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికలకు ఇది ఓ టానిక్ గా పనిచేస్తుందనటంలో సందేహం లేదు. గుజరాత్ ఎలాగూ బిజెపి పాలిత రాష్ట్రమే. దీంతోపాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రం అయిన హిమాచల్ ప్రదేశ్ ను కూడా బిజెపినే దక్కించుకుంది. దీంతో తాజాగా ఎన్నికలు జరిగిన గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు రెండు బిజెపి చేతిలోకి వచ్చినట్లు అయింది.
సోమవారం ఓటింగ్ ప్రారంభం అయినప్పటి నుంచి తీవ్ర ఉత్కంఠ రేపిన గుజరాత్ ఫలితాలు అంతిమంగా బిజెపివైపే మొగ్గుచూపాయి. గుజరాత్ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత, జీఎస్టీపై వ్యాపారుల్లో ఉన్న ఆగ్రహం తమకు కలసి వస్తాయని కాంగ్రెస్ పార్టీ భారీ ఆశలే పెట్టుకుంది. అయితే విచిత్రంగా పెద్ద ఎత్తున వ్యాపార వర్గాలు ఉండే సూరత్ ప్రాంతంలో కూడా బిజెపి మెజారిటీ సీట్లు దక్కించుకోవటం ఆసక్తికర పరిణామంగా మారింది. జీఎస్టీపై ఆ స్థాయిలో వ్యతిరేకత ఉన్న తరుణంలో గుజరాతీల ఎందుకు మోడీ వైపు మొగ్గుచూపారన్నది ఆసక్తికర పరిణామంగా మారింది. దీనికితోడు పాటీదార్ల ఉద్యమం...హార్దిక్ పటేల్ మద్దతు కూడా కాంగ్రెస్ ను గుజరాత్ లో ఒడ్డునపడేయలేకపోయాయి.