ఒకేసారి చంద్రబాబు..కెసీఆర్ కు మోడీ ఝలక్!
ఒక్క దెబ్బకు ప్రధాని నరేంద్రమోడీ ఇద్దరు సీఎంల ఆశలపై నీళ్లు చల్లారు. ఓ రకంగా చెప్పాలంటే ఇది రాజకీయంగా ఇద్దరికీ పెద్ద సవాల్ గానే మారనుంది. ఏ రాష్ట్రం అయినా సరే సుప్రీంకోర్టు విధించిన 50 శాతం పరిమితికి మించి రిజర్వేషన్లు ఇస్తామని చెపితే అది తప్పుడు హామీనే అని స్పష్టం చేశారు. ప్రధాని మోడీ ప్రకటన అటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ఇటు తెలంగాణ సీఎం కెసీఆర్ కు షాక్ లాంటిదే. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా బీసి కమిషన్ సభ్యుల అరకొర నివేదికతోనే ఏకంగా అసెంబ్లీలో బిల్లు పెట్టి కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించటంతో పాటు..తన హమీని అమలు చేసినట్లు ప్రకటించుకున్నారు. ఈ బిల్లును కేంద్రానికి పంపుతామని..రాజ్యాంగ సవరణ ద్వారా రిజర్వేషన్ల అమలుకు చర్యలు తీసుకుంటామని చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. దీంతో ఏపీలో కాపుల్లో ఆశలు చిగురించాయి. కానీ తాజాగా ప్రధాని మోడీ చేసిన ప్రకటన వీరి ఆశలపై నీళ్లు చల్లినట్లు అయింది.
తెలంగాణ సీఎం కెసీఆర్ దీ అదే పరిస్థితి. ముస్లిం రిజర్వేషన్లను 4 శాతం నుంచి 12 శాతానికి పెంచుతూ అసెంబ్లీలో తీర్మానం చేశారు. పైగా ప్రధాని మోడీ తనకు హామీ ఇచ్చారని...ముస్లింలకు ఖచ్చితంగా 12 శాతం రిజర్వేషన్లు సాధించి తీరతామని కెసీఆర్ పలు మార్లు ప్రకటించారు. దీని కోసం అవసరం అయితే సుప్రీంకోర్టుకు కూడా వెళతామని..తమిళనాడులో ఉన్న తరహాలోనే తమకూ 50 శాతంపైన రిజర్వేషన్లకు అనుమతించాల్సిందేనని వాదిస్తున్నారు. అయితే ప్రధాని నరేంద్రమోడీ ప్రకటన ఈ అనుమానాలను పటాపంచలు చేస్తూ ఏభై శాతంపైన రిజర్వషన్లు సాధ్యంకాదని ప్రకటించటం ద్వారా ఓ స్పష్టత ఇఛ్చినట్లు అయింది. ఈ పరిణామాలపై మరి తెలుగు రాష్ట్రాల సీఎంలు కెసీఆర్, చంద్రబాబు ఎలా స్పందిస్తారో వేచిచూడాల్సిందే.