మోడీ మమ్మల్ని పట్టించుకోవటం లేదు
తెలుగుదేశం ఎంపీ జె సీ దివాకర్ రెడ్డి కేంద్రంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ప్రధాని మోడీ తమను అసలు ఏ మాత్రం పట్టించుకోవటంలేదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. గట్టిగా ఏమైనా మాట్లాడితే గెటౌట్ అనేలా తమ పరిస్థితి ఉందని...ఏదో సంఖ్య కోసమే ఉన్నామే తప్ప..ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న తమకు ఏ పని జరగటంలేదని తేల్చిచెప్పారు. తమ పార్టీకే ఏమీ జరగటంలేదని..ఇక వ్యక్తిగతంగా తాము చేయగలమని ప్రశ్నించారు. తమ పరిస్థితి కరువేపాకు చందంగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఓ ఛానల్ తో మాట్లాడుతూ ఆయన ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.
సాగునీటి విషయంతో పాటు..రాష్ట్రం అభివృద్ధికి చంద్రబాబు ఎంతో కృషి చేస్తున్నారని...అందరి దగ్గరికి వెళుతున్నారని అయినా ఉపయోగం లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. బిజెపి కేంద్రంలో పూర్తి బలంలో అధికారంతో ఉండటం వల్ల ప్రస్తుతం తాము చేయగలిగింది ఏమీ లేదని..ఏపీలో ప్రభుత్వం ఏమైనా చేసింది చెప్పుకుని వచ్చే ఎన్నికల్లో గెలవాలి తప్ప..కేంద్రం నుంచి రాష్ట్రానికి ఒరిగేది ఏమీలేదన్నారు. అందరూ ప్రత్యేక హోదా గురించి ప్రశ్నించినా కేంద్రం ఏ మాత్రం పట్టించుకోలేదన్న విషయం అందరూ చూశారని వ్యాఖ్యానించారు.