Telugu Gateway
Andhra Pradesh

కాంట్రాక్ట్ లు చంద్రబాబు..కేసులు మోడీ చూసుకోవాలట!

పోలవరం జాతీయ ప్రాజెక్టు. ఇందులో ఎవరికీ అనుమానం లేదు. కానీ కాంట్రాక్ట్ లు మాత్రం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చూసుకుంటారంట. రాష్ట్రాల మధ్య ఏమైనా కేసులు తలెత్తితే ప్రధాని నరేంద్రమోడీ చూసుకోవాలట. ఇదీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి వ్యవహారం. కేంద్రం ఎప్పుడో 2015లోనే పోలవరం ప్రాజెక్టులో ఎలాంటి మార్పులు, చేర్పులు చేసినా ఖచ్చితంగా పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఎ) ముందస్తు అనుమతితోనే చేయాలని విస్పష్టంగా లేఖ రాయగా...దాన్ని పక్కన పెట్టి ఇష్టానుసారం సబ్ కాంట్రాక్ట్ లు ఇచ్చి..కొత్తగా అస్మదీయ కాంట్రాక్టర్లను తెచ్చుకునేందుకు రెడీ అయిన చంద్రబాబుకు ఇప్పుడు మాత్రం పోలవరం జాతీయ ప్రాజెక్టు అని గుర్తొచ్చిందన్న మాట. మంగళవారం నాడు చంద్రబాబు అమరావతిలో ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. ఇందులోనే పోలవరం అంశం కూడా ప్రస్తావనకు వచ్చింది. ఒరిస్సా ప్రభుత్వం సుప్రీంకోర్టుకు రాసిన లేఖపై అధికారులు చంద్రబాబుకు వివరించగా..పోలవరం నిర్మాణంలో ఇదో కొత్త పరిణామం అని వ్యాఖ్యానించారు. సీఎంలు మాట్లాడుకోవాలని ఒరిస్సా కోరుతుందని అధికారులు తెలపగా..పోలవరం జాతీయ ప్రాజెక్టు అయినందున ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రధాని మోడీదే అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.

ఇప్పటికే తాను ఒరిస్సా సీఎంతో మాట్లాడానని..రాజకీయ ఒత్తిళ్ల వల్లే ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని వ్యాఖ్యానించినట్లు సమాచారం. చత్తీస్ ఘడ్ సీఎంకు పరిస్థితి వివరించాక..ఆయన ప్రస్తుతం ఏమీ మాట్లాడటం లేదన్నారు. కొద్ది రోజుల క్రితం కేంద్ర కొత్తగా పిలిచిన టెండర్లను పక్కన పెట్టాలని లేఖ రాయగా...దీనిపై నానా యాగీ చేసిన సీఎం చంద్రబాబు ఒరిస్సా అభ్యంతరాలపై ప్రధానే సమావేశం ఏర్పాటు చేయాలని వ్యాఖ్యానిస్తున్నారు. అదే కేంద్రం రాసిన లేఖపై మోడీని తప్పుపట్టిన చంద్రబాబు..ఇప్పుడు మాత్రం మోడీ వైపు చూడటం విశేషం. నిజానికి పోలవరంలో ఏ సమస్య వచ్చినా పరిష్కరించాల్సింది కేంద్రమే. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ చంద్రబాబు తనకు నచ్చినట్లు చేస్తూ..వీలును బట్టి ఒక్కో అంశంలో ఒక్కో స్టాండ్ తీసుకోవటమే సమస్యలకు కారణం అవుతుందని చెబుతున్నారు.

Next Story
Share it