సీఎం లేకుండా కేబినెట్... ఛైర్మన్ లేకుండా బీసీ కమిషన్ నివేదికా?!
ముఖ్యమంత్రి లేకుండా మంత్రులు అందరూ ఉన్నా.. మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకోగలుగుతుందా?. అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే అలాంటి పరిస్థితి ఉత్ఫన్నం అవుతుంది. సీఎం లేకుండా మంత్రివర్గ సమావేశం జరగటం ఎంత అసహజమో..బీసీ కమిషన్ ఛైర్మన్ లేకుండా కేవలం కేవలం సభ్యులు నివేదిక ఇవ్వటం...దాన్ని హడావుడిగా మంత్రివర్గం ఆమోదించటం..అంతే త్వరగా అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆమోదించటం అంతేనా?. అవును అంటున్నాయి ప్రభుత్వ వర్గాలు. ఇదే వ్యవహారం ఏపీ అధికార వర్గాల్లో ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. సాక్ష్యాత్తూ బీసీ కమిషన్ ఛైర్మన్ అయిన రిటైర్డ్ జడ్జి మంజునాథ్ తాను అసలు నివేదిక ఇవ్వలేదని..సభ్యులు ఇచ్చిన నివేదిక గురించి తనకు తెలియదని విస్పష్టంగా ప్రకటించారు. ఇది ఎలా ఉంది అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు లేకుండానే మంత్రివర్గం మొత్తం సమావేశం అయి ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఉంది అని ఓ అధికారి వ్యాఖ్యానించారు.
పోనీ బీసీ కమిషన్ ఛైర్మన్ గా మంజునాథను నియమించింది గత ప్రభుత్వాలా? అంటే అదీ కాదు. చంద్రబాబు సర్కారే ఆయన నియామకం చేసింది. కానీ నివేదిక దగ్గరకు వచ్చేసరికి వ్యవహారం మరో మలుపు తిరిగింది. కమిషన్ ఛైర్మన్ మంజునాథ ను పక్కన పెట్టి సభ్యుల నుంచి నివేదిక తీసుకుని హడావుడిగా...కేబినెట్, అసెంబ్లీ ఆమోదం పొందటం చూస్తుంటే ఇదంతా పక్కా ప్రణాళికతోనే చేసినట్లు కన్పిస్తోందని ఆరోపణలు వస్తున్నాయి. ఎవరైనా ఛైర్మన్ ఆమోదం లేకుండా..కేవలం కమిషన్ సభ్యుల నివేదిక ఆధారంగా ఇంత కీలక నిర్ణయం తీసుకున్నారని కోర్టులను ఆశ్రయిస్తే ఇబ్బందులు తప్పవని ప్రభుత్వ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. మూడున్నర సంవత్సరాల తర్వాత కూడా ఎలాంటి లోపాలు లేకుండా..పక్కాగా చేయాల్సిన కాపు రిజర్వేషన్లు వంటి అత్యంత కీలక అంశాన్ని వివాదస్పదం చేయటం సరికాదనే వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి.
ప్రభుత్వం మాత్రం మంజునాథకు వ్యతిరేకంగా గత రెండు రోజులుగా మీడియాకు లీకులు ఇస్తూ ..ఆయన ఏదో కుట్ర చేస్తున్నారనే అభిప్రాయాన్ని కల్పించేందుకు ప్రయత్నిస్తోంది. ప్రభుత్వం నియమించిన బీసీ కమిషన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయాల్సిన అవసరం ఏముంటుంది?. క్షేత్ర స్థాయిలో పరిశీలించిన వాస్తవాలతో కమిషన్ నివేదిక ఇస్తుందా?. ఉంటే గింటే కమిషన్ పై కాస్తో కూస్తో ప్రభుత్వ ప్రభావం ఉంటుంది కానీ..బయటి వ్యక్తుల ప్రభావం ఎలా ఉంటుంది?. అన్నది పెద్ద సస్సెన్స్ గా మారింది. అయితే ఏకంగా మంజునాథ ను కమిషన్ ఛైర్మన్ గా నియమించిన సర్కారే ఆయన నివేదిక చెల్లదని చెప్పటం పెద్ద వింతగా మారింది. చూడాలి ఈ వ్యవహారం ఎన్ని మలుపులు తిరుగుతుందో..