కాంగ్రెస్ లో మణిశంకర్ అయ్యర్ కలకలం
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు నువ్వా..నేనా అన్నట్లు జరుగుతున్నాయి. అక్కడ పరిస్థితి అధికార బిజెపి కాంగ్రెస్ ల మధ్య ఢీ అంటే ఢీ అనేలా ఉందని సర్వేలు చెబుతున్నాయి. ఓ వైపు బిజెపిలో కూడా ఆందోళన ఉంది. జీఎస్టీ ఎఫెక్ట్ తో పాటు..గత కొన్నేళ్ళుగా పేరుకుపోయిన అసంతృప్తి దెబ్బ తీస్తుందా? అన్న అలజడి వారిలో ఉంది. ఈ తరుణంలో కాంగ్రెస్ నుంచి ఓ అస్త్రం దొరికింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి మణిశంకర్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలు బిజెపికి రాజకీయంగా కలసి వచ్చాయి. ప్రధాని మోడీని ఉద్దేశించి అయ్యర్ చేసిన ‘నీచ జాతికి చెందిన వ్యక్తి’ వ్యాఖ్యలు కొంపముంచేలా ఉన్నాయి. దీంతో కాంగ్రెస్ కూడా వెంటనే రంగంలోకి దిగింది. అయ్యర్ తో వెంటనే క్షమాపణ చెప్పించింది.
అంతే కాదు..పార్టీ ప్రాధమిక సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. వేగంగా రియాక్ట్ అవ్వటం ద్వారా కాంగ్రెస్ పార్టీ కొంత అయినా డ్యామేజ్ కంట్రోల్ చేసుకోగలిగింది. అయ్యర్ వ్యాఖ్యలను ఏ మాత్రం సమర్థించబోమని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులెవరూ ఇలాంటి పరుష పదాలను వినియోగించకూడదని ఆయన కోరారు. అయ్యర్ వ్యాక్యలపై మోడీ సీరియస్ గా స్పందిచాంరు. ఈ వ్యాఖ్యలు గుజరాతీలకు జరిగిన అవమానమని, కాంగ్రెస్ నేతల మొఘల్ ఆలోచనకు ఇది ప్రతిరూపమని సూరత్‌లో అన్నారు. ఎన్నికల్లో బీజేపీకి ఓటేయటం ద్వారా కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు.