Telugu Gateway
Telugu

మ‌న్మోహ‌న్ సింగ్ కుట్ర చేస్తే..మోడీ క‌ళ్లుమూసుకున్నారా?

గుజ‌రాత్ ఎన్నిక‌ల స‌మ‌యంలో ప్రధాని న‌రేంద్ర‌మోడీ చేసిన వ్యాఖ్య‌ల‌పై కాంగ్రెస్ మండిప‌డింది. స‌భ‌లోనూ..బ‌య‌టా తీవ్ర స్థాయిలో స్పందించింది. మాజీ ప్రధాని మన్మోహన్‌ పాకిస్థాన్‌తో కలిసి ఢిల్లీ కుట్ర చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం కళ్లు మూసుకుందా? ఇప్పటివరకు ఎఫ్‌ఐఆర్‌ ఎందుకు నమోదు చేయలేదు. ఎన్నికల ప్రచారం కోసం ప్రధాని చెప్పిన అబద్ధమిది' అని ఖర్గే విమర్శించారు. స‌భ వెలుప‌ల మీడియాతో మాట్లాడుతూ మ‌ల్లిఖార్జున ఖ‌ర్గే ఈ వ్యాఖ్య‌లు చేశారు. అంత‌కు ముందు స‌భ‌లో ఈ అంశంపై పెద్ద దుమారమే రేగింది. మన్మోహన్‌పై ప్రధాని మోదీ వ్యాఖ్యలను తప్పుబడుతూ కాంగ్రెస్‌ ఎంపీలు మంగళవారం లోక్‌సభలో నిరసన తెలిపారు. మన్మోహన్‌కు మోదీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.సభ ప్రారంభమైన వెంటనే ఈ అంశాన్ని లేవనెత్తుతూ కాంగ్రెస్‌ సభ్యులు ఆందోళనకు దిగారు. ఈ అంశంపై వెంటనే చర్చ చేపట్టాలని డిమాండ్‌ చేశారు.

ఈ డిమాండ్‌ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ తోసిపుచ్చారు. ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలపై సభలో చర్చించడం కుదరదని ఆమె స్పష్టం చేశారు. కానీ కాంగ్రెస్‌ సభ్యుల ఆందోళన ఆపలేదు. ఈ గందరగోళం నడుమ సభ కాసేపు కొనసాగించిన స్పీకర్‌ ఆ తర్వాత వాయిదా వేశారు. అనంతరం జీరో అవర్‌ సందర్భంగా సభ తిరిగి ప్రారంభమైనా కాంగ్రెస్‌ సభ్యులు తిరిగి ఆందోళన కొనసాగించారు. కాంగ్రెస్‌ సభ్యుల ఆందోళన నడుమ స్పీకర్‌ సభను కొనసాగించారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌ లోక్‌సభ పక్షనేత మల్లికార్జున ఖర్గే మాట్లాడేందుకు ప్రయత్నించగా.. అందుకు స్పీకర్‌ అనుమతించలేదు. ఇందుకు నిరసనగా కాంగ్రెస్‌ సభ్యులు వాకౌట్‌ చేశారు.

Next Story
Share it