కెటీఆర్ కు రేవంత్ రెడ్డి ఎవరో తెలియదట!
తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటీఆర్ గురువారం నాడు ట్విట్టర్ లో నెటిజన్లతో మాట్లాడారు. వారు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. అందులో ఓ విచిత్రమైన వ్యాఖ్య ఉంది. అదేంటి అంటే..ఆయనకు టీ టీడీపీ నుంచి ఇటీవల కాంగ్రెస్ లో చేరిన రేవంత్ రెడ్డి ఎవరో తెలియదట. కానీ ఇదే కెటీఆర్ ఈ మధ్య మంత్రి లక్ష్మారెడ్డి, రేవంత్ రెడ్డి మధ్య సాగిన తిట్ల పురాణంపై ఏకంగా కాంగ్రెస్ నూతన అధ్యక్షుడు రాహుల్ గాంధీకి రేవంత్ పై ఫిర్యాదు చేశారు. మణిశంకర్ అయ్యర్ పై చర్యలు తీసుకున్న కాంగ్రెస్ పార్టీ అభ్యంతరకర భాష మాట్లాడుతున్న రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోదా?. అని ట్విట్టర్ లో వ్యాఖ్యానించారు. ఇక ఆ విషయం వదిలేస్తే పలు ఇతర అంశాల గురించి కూడా కెటీఆర్ మాట్లాడారు. కొత్త సంవత్సరంలో శారీరకంగా, మానసికంగా ‘ఫిట్’గా ఉండటమే తన నూతన సంవత్సర తీర్మానమని వెల్లడించారు. దేవుడిని కాకుండా కర్మను నమ్ముతానని చెప్పారు. ఎవరెవరంటే అభిమానమంటూ పలువురు నెటిజన్లు ప్రశ్నించగా.. రాహుల్ ద్రవిడ్, కోహ్లీ, రోహిత్ అభిమాన క్రికెటర్లని కేటీఆర్ తెలిపారు. షారూక్‌ఖాన్ తన అభిమాన బాలీవుడ్ నటుడన్నారు.
కేసీఆర్ కాకుండా తాను అధికంగా ఇష్టపడే రాజకీయ నాయకుడు బరాక్ ఒబామా అని చెప్పారు. ఇండియన్ చైనీస్ వంటలు తనకు ఇష్టమైన ఆహారమని, అమెరికాలో ఉన్నప్పుడు వంట చేసుకునే వాడినని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ తమ సోదర రాష్ట్రమన్నారు. అక్కడ ఎవరికి ఓటేస్తారని అడిగితే.. తనకు అక్కడ ఓటు లేనందున టీడీపీకా, వైసీపీకా అనేది చెప్పలేనని పేర్కొన్నారు. మెట్రో రైలు ప్రారంభం, జీఈఎస్ సమావేశం రెండూ ఒకే రోజు జరగడం ఈ ఏడాది గుర్తుండిపోయే రోజని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ కేంద్రీకృతంగా మాత్రమే కాకుండా అన్ని ప్రాంతాలు, రంగాలను కలుపుకొంటూ సమ్మిళిత అభివృద్ధి దిశగా వెళుతోందని చెప్పారు. రక్షణ భూముల సేకరణ కష్టంగా ఉన్నందున స్కైవేల నిర్మాణం ఆలస్యం అవుతోందని.. పాతబస్తీకి కచ్చితంగా మెట్రోరైలు వస్తుందని తెలిపారు.
నగరంలో డీజిల్ బస్సుల వల్ల కాలుష్యం పెరుగుతోందన్నారు. సీఎన్జీ, ఎల్పీజీ బస్సుల వినియోగం పెంచవచ్చు కదాని అడిగితే.. ఎలక్ట్రిక్ వాహనాలే సరైన పరిష్కారమని పేర్కొన్నారు. వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేసేందుకే ఎకరాకు రూ. 4 వేల ఆర్థికసాయం, రైతు సమితులు, వ్యవసాయ విస్తరణ కార్యక్రమాలు చేపట్టినట్లు వెల్లడించారు. మంత్రి హరీశ్‌రావు మొండి పట్టుదల కలిగిన హార్డ్ వర్కింగ్ నాయకుడు అని వ్యాఖ్యానించారు. ఇక సినిమా హీరోల విషయానికి వస్తే అల్లు అర్జున్ ఎనర్జీ, స్టైల్, మహేశ్‌బాబు సూపర్‌స్టార్, ప్రభాస్ బాహుబలి, జూనియర్ ఎన్‌టీఆర్ ఒక పెర్ఫార్మర్, సచిన్ ఒక లెజెండ్ పవన్ కల్యాణ్ ఒక ఎనిగ్మా (అర్థంకానివారు) అని వ్యాఖ్యానించారు. పవన్ కళ్యాణ్ రాజకీయాలను ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు.
ముఖ్యమంత్రి గురించి ఒక్కమాటలో చెప్పాలని నెటిజన్లు కోరగా.. ‘సానుకూల ఫలితాలు సాధించే టాస్క్ మాస్టర్’అని కేటీఆర్ బదులిచ్చారు.