అసెంబ్లీలో కాపు రిజర్వేషన్ల బిల్లు
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ప్రభావితం చేసే అత్యంత కీలకమైన కాపు రిజర్వేషన్ల బిల్లును ఏపీ సర్కారు శనివారం నాడు అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఇది ఉభయ సభల్లో ఆమోదం పొందటం కేవలం లాంఛనమే. ఈ బిల్లు ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కాపు రిజర్వేషన్ల అమలు భారాన్ని కేంద్రంపై నెట్టేయనుంది. ఎందుకంటే ఇఫ్పటికే రిజర్వేషన్లు పరిమితి దాటడంతో కొత్తగా ఈ రిజర్వేషన్ల అమలుకు కేంద్రం అనుమతి తప్పనసరి కానుంది. ప్రస్తుతం ప్రధాని నరేంద్రమోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి మధ్య సంబంధాలు అంతంత మాత్రంగా ఉన్న తరుణంలో కేంద్రం ఏ మేరకు ఈ రిజర్వేషన్లకు ఆమోదం తెలుపుతుంది అన్నది ఆసక్తికరంగా మారింది. కాపు రిజర్వేషన్లకు కేబినెట్ ఆమోదం తెలిపి..అసెంబ్లీలో బిల్లు ఆమోదించి కేంద్రానికి పంపితే సరిపోదు. అది ఖచ్చితంగా అమలు అయ్యేలా చూడకలేకపోతే మాత్రం అధికార టీడీపీ దానికి మూల్యం చెల్లించుకోవాల్సి రావటం ఖాయం. ఎందుకంటే కేంద్రంలో ఉన్న సర్కారులో టీడీపీ కూడా భాగస్వామినే ఉంది. ఏది ఏమైనా కాపు రిజర్వేషన్లకు ఆమోదం తెలపటం ద్వారా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తనపై ఉన్న భారాన్ని చాలా వరకూ దించుకున్నట్లే. ఇక అది అమలు సాధ్యమా?. కాదా అనే అంశంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
కేంద్రం ఈ రిజర్వేషన్ల అమలుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోతే సహజంగానే ఈ ఈ అపవాదును చంద్రబాబు సర్కారు కేంద్రంపై తోసేయటం ఖాయం. తాము ఎంతో కసరత్తు చేసి...కమిషన్ వేసి రిజర్వేషన్లు ఓకే చేసినా కేంద్రం అడ్డుపుల్ల వేసిందని చెప్పుకోవచ్చు. శనివారం నాడే సుదీర్ఘ చర్చల అనంతరం కాపు రిజర్వేషన్లకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులాలను బీసీల జాబితాలో చేర్చి ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించింది. మంజునాథ కమిషన్ సిఫారసుల ప్రకారం కాపులకు రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించింది. ఇందుకోసం రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్‌లోని బీసీల జాబితాలో కాపులను చేర్చేలా బిల్లు రూపొందించారు. బీసీ (కాపు) రిజర్వేషన్లపై ఏర్పాటైన జస్టిస్ మంజునాథ కమిషన్ శుక్రవారం తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. కమిషన్ ఇచ్చిన నివేదిక ప్రకారం కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులాలను బీసీలుగా గుర్తించి ఐదు శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయించింది. బీసీల కోసం ఇప్పటికే ఉన్న ఏ, బీ, సీ, డీ, ఈ కాకుండా కొత్తగా ఎఫ్ సెక్షన్‌ను సృష్టించి ఈ నాలుగు కులాలను అందులో చేర్చడానికి ఆమోదం తెలిపింది. అయితే విద్య, ప్రభుత్వ ఉద్యోగాలు, ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించిన అంశాల్లో మాత్రమే ఈ రిజర్వేషన్లను వర్తింపచేయాలని స్పష్టం చేసింది. రాజకీయ పదవులకు ఈ రిజర్వేషన్లను వర్తింపచేయకూడదని నిర్ణయించింది. రాష్ట్రంలో రిజర్వేషన్ల కోటా 50 శాతానికి మించడంతో ఆమోదం కోసం ఈ చట్టాన్ని కేంద్రానికి పంపాలని నిర్ణయించారు. వాల్మీకి, బోయ కులస్థులను ఎస్‌టీల జాబితాలో చేర్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.