Telugu Gateway
Andhra Pradesh

మొన్న కేఈ...నేడు చినరాజప్పకు అవమానం

ఏపీలో ఉప ముఖ్యమంత్రులకు అవమానాల భారం. పదే పదే జరుగుతున్న సంఘటనలు వారిని మరింత ఇబ్బందికి గురిచేస్తున్నాయి. అయినా బయటపడలేని పరిస్థితి. కాకపోతే తమ సన్నిహితుల వద్ద మాత్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరు ఉప ముఖ్యమంత్రులకు సొంత ప్రభుత్వమే వరస పెట్టి అవమానాల పాలు చేస్తోంది. గత కొంత కాలంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి తీరుపై ఉప ముఖ్యమంత్రి కే ఈ కృష్ణమూర్తి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఎందుకంటే ఆయన శాఖకు సంబంధించిన పలు కీలక నిర్ణయాలను సీఎంవో తన పరిధిలోకి లాగేసుకుంది. అంతే కాదు కొన్నిసార్లు సమీక్షలకు సంబంధించిన సమాచారం ఇవ్వకుండానే సీఎం చంద్రబాబునాయుడు నిర్ణయాలు తీసుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అత్యంత కీలకమైన రాజధాని వ్యవహారంలోనూ ఆయన్ను దూరం పెట్టిన సంగతి తెలిసిందే. అంతే కాదు..మంత్రివర్గ ఉప సంఘాల్లోనూ ఎంతో సీనియర్ అయిన, ఉప ముఖ్యమంత్రి అయిన కేఈ కృష్ణమూర్తిని విస్మరించి నారా లోకేష్ కు కమిటీలో చోటు కల్పించారు. ఇప్పుడు ఏపీ హోం మంత్రి..ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప వంతు వచ్చింది. తొలి నుంచి ఆయన పరిస్థితి కూడా అదే. బాధ్యతలు చేపట్టిన తొలి రోజుల్లోనే హోం మంత్రికి సరైన కారు కూడా ఇవ్వలేదు. ఈ విషయాన్ని ఆయన అప్పటి డీజీపీ జె వి రాముడు కు చెప్పగా..ఆయన వెంటనే ఆయన కారు మార్పు చేయించారు.

గురువారం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కొత్తగా ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ శంఖుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి సంబంధిత శాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రిగా ఉన్న హోంమంత్రికి ఆహ్వానం అందలేదు. కానీ ఏ మాత్రం సంబంధం లేని మరో మంత్రి నారాయణ మాత్రం అక్కడ హంగామా చేశారు. ఇది చూసిన వారంతా అవాక్కు అయ్యారు. అసలు సంబంధిత శాఖ మంత్రిని పిలవలేదు కాని..నారాయణ హంగామా ఏమిటనే వ్యాఖ్యలు విన్పించాయి. ఫోరెన్సిక్ ల్యాబ్ శంకుస్థాపన కు హోం మంత్రికి ఒక కానిస్టేబుల్‌తో ఆహ్వానం పంపించారనని సమాచారం.బుధవారం రాత్రి కూడా అందుబాటులో ఉన్న ఆయన ఈ అవమానాన్ని భరించలేక తిరుపతి వెళ్లిపోయారని చెబుతున్నారు. ఇలా సీఎం తర్వాత ప్రొటోకాల్ లో ముందు వరసలో ఉండే ఉప ముఖ్యమంత్రులకు వరస పెట్టి పరాభవాలు జరగటం కావాలనే చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రాజకీయ అవసరాల కోసం హోదాలు అయితే ఇచ్చారు కానీ అంతా చంద్రబాబు, నారా లోకేష్ లే వెనకుండి నడిపించుకుంటున్నారనే విమర్శలు విన్పిస్తున్నాయి.

Next Story
Share it