‘అమ్మ’ వీడియో కలకలం
జయలలిత మృతిపై ఎన్ని అనుమానాలో. ఎన్ని వాదనలో. ఆమె ఎలా హాస్పిటల్ కు ఏ పరిస్థితిలో చేరారు?. వైద్యం అందించే సమయంలో ఆమెను ఎవరినీ చూడనీయలేదు ఎందుకు?.. ఏకంగా వైద్యుల బృందానికీ ఇదే పరిస్థితి ఎందుకు ఎదురైంది. ఓ వైపు విచారణ సాగుతోంది. కానీ అకస్మాత్తుగా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత జయలలిత ఆసుపత్రిలో చేరినప్పటి ఫొటోలు, వీడియో బయటకు వచ్చాయి. అదీ రాజకీయ కారణాలతో కావటం విశేషం. గురువారం నాడు ఆర్కే నగర్ ఉప ఎన్నిక జరగనుండటంతో వీటిని వ్యూహాత్మకంగా విడుదల చేశారు. అపోలో ఆసుపత్రిలో జయ చేరిన అనంతరం ఆమెను ఎవరూ కలవలేదనే ఆరోపణలపై స్పందించిన టీటీవీ దినకరన్ మద్దతుదారుడు పీ వెట్రివేల్ ఈ వీడియోను విడుదల చేశారు.
జయ వీడియోను చాలా రోజులుగా విడుదల చేయాలనుకుంటున్నామని, అనివార్య కారణాల వల్ల అప్పుడు బయటపెట్టలేదని వెట్రివేల్ వెల్లడించారు. జయ మృతిపై ఏర్పాటైన కమిషన్ నుంచి తమకు ఎలాంటి సమన్లు అందలేదని తెలిపారు. సమన్లు అందిన తర్వాత ఆధారాలను కమిషన్ ముందు ఉంచుతామని అన్నారు. ఆర్కే నగర్ ఉప ఎన్నికలో లాభపడేందుకు జయ వీడియో, ఫొటోలను దినకరన్ వర్గం ఇప్పుడు విడుదల చేసిందనే విమర్శలు హోరెత్తుతున్నాయి. మరోవైపు ఆర్కే నగర్ ఉప ఎన్నికను వాయిదా వేయాలనే పిటిషన్ ఢిల్లీ హైకోర్టు బుధవారం తిరస్కరించింది.
https://www.youtube.com/watch?v=TcA3e1o5rfk