మొబైల్ డాటా వాడకంలో భారత్ నెంబర్ వన్
భారత్ ఓ కొత్త రికార్డును సాధించింది. ప్రపంచంలోనే మొబైల్ ఇంటర్నెట్ డాటా వాడకంలో అగ్రస్థానానికి చేరుకుంది. భారత్ నెలకు 150 గిగాబైట్ల డేటాను వాడుతోంది. దీంతో భారత్ ఈ డేటా వాడకంలో ప్రపంచంలోనే నెంబర్ వన్ గా ఉంది. ఈ విషయాన్ని నీతి అయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. విశేషం ఏమిటంటే మొబైల్ డాటా వాడకంలో భారత్ ప్రపంచంలోనే అగ్రరాజ్యాలుగా ఉన్న అమెరికా, చైనాలను కూడా భారత్ దాటేయటం. గ్రామాల దగ్గర నుంచి ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్లు వచ్చాయి. అంతే కాకుండా దేశీయ టెలికం రంగంలోనే రిలయన్స్ జియో ఓ సంచలన సృష్టించింది. జియో వచ్చిన తర్వాతే దేశంలో మొబైల్ డేటా వాడకం గణనీయంగా పెరిగింది.
యువత ఎక్కువగా ఫేస్ బుక్, వాట్సప్ లతో పాటు వీడియోల వీక్షణకు డేటాను ఉపయోగిస్తోంది. జియో రాక ముందు డేటా రేట్లు చాలా ఎక్కువగా ఉండేవి. జియో దెబ్బకు ఈ రేట్లు గణనీయంగా తగ్గుముఖం పట్టడంతో వాడకం కూడా అదే స్థాయిలో పెరిగింది. జియో ఎంట్రీతో ఇతర టెలికం సంస్థలు కూడా రేట్లు తగ్గించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతిమంగా వినియోగదారులకు చౌకధరలకే డాటా అందుబాటులోకి వచ్చింది. జియో వినియోగదారులకు నెలకు 100 కోట్ల జీబీ డేటాను ఉపయోగిస్తున్నట్లు అంచనా.