Telugu Gateway
Cinema

‘హలో’ మూవీ రివ్యూ

తొలి సినిమాతోనే అక్కినేని అఖిల్ అభిమానులను నిరాశపర్చాడు. దీంతో రెండవ సినిమా ఎలాగైనా సూపర్ హిట్ కొట్టాలని నిర్ణయించుకున్నాడు. అందుకే ఆలశ్యం అయినా సరే ‘మనం’ వంటి సూపర్ హిట్ అందించిన విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ‘హలో’ అంటూ ముందుకొచ్చాడు. అక్కినేని నాగార్జున నిర్మాతగా ఈ సినిమాను తెరకెక్కించారు. అఖిల్ హీరోగా నటించిన రెండవ సినిమా ‘హలో’ శుక్రవారం నాడు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి అఖిల్ అక్కినేని ఈ సినిమాతో అయినా విజయాన్ని అందుకున్నారా..లేదా? తెలుసుకోవాలంటే ముందుకు సాగాల్సిందే. ఇక సినిమా అసలు కథ విషయానికి వస్తే శ్రీను(అఖిల్), జును (కళ్యాణి) చిన్నప్పుడే ఓ పానీపూరి బండి దగ్గర స్నేహితులు అవుతారు. రోజూ వాళ్ళిద్దరూ పానీపూరి బండి దగ్గరే కలుసుకుంటూ...కబుర్లు చెప్పుకుంటూ సరదాగా ఉంటుంటారు. శ్రీను రోడ్లపై ఫియానో వాయిస్తూ తన అవసరాలకు డబ్బులు సంపాదిస్తుంటాడు. జును తండ్రికి ఢిల్లీకి ట్రాన్స్ ఫర్ అవుతుంది. దీంతో వాళ్ళ ఫ్యామిలీ ఢిల్లీకి ఫిష్ట్ అవుతుంది. రోడ్డుపై ఫియానో వాయించే క్రమంలో తాను కన్పించకుండా జును ప్రతి రోజూ శ్రీనుకు వంద రూపాయలు ఇస్తూ ఉండేది. కానీ ఢిల్లీ వెళ్లే ముందు తాను ఇచ్చే వంద రూపాయల నోటుపై తన ఫోన్ నెంబర్ రాసి ఇచ్చి వెళతుంది. కానీ ఫోన్ నెంబర్ ఉన్న వంద రూపాయల నోటును వేరే వ్యక్తి దొంగిలించటంతో...అప్పటి నుంచి ఎలాగైనా జునును కలవాలనే ప్రయత్నంలో ఉంటాడు.

ఓ క్యాబ్ డ్రైవర్ రాంగ్ కాల్ చేసిన సమయంలో శ్రీను తాను ఫియానోలో ట్యూన్ చేసిన పాట విన్పిస్తుంది. అది ఎక్కడ నుంచి విన్పిస్తుంది తెలుసుకునే సమయంలో శ్రీను ఫోన్ ను ఓ దొంగ ఎత్తుకెళతాడు. అంతే ఫోన్ ను దక్కించుకునే క్రమంలో ఫైట్లు..స్టంట్స్. అనాథగా ఉన్న శ్రీను ఓ రోడ్డు ప్రమాదంలో గాయపడతాడు. అప్పటి నుంచే జగపతిబాబు, రమ్యకృష్ణలు శ్రీను ను పెంచి పెద్ద చేస్తారు. మరి శ్రీను, జును ప్రేమ సక్సెస్ అయిందా? లేదా తెలుసుకోవాలంటే వెండితెరపై చూడాల్సిందే.

హలో సినిమాలో అఖిల్ తన వరకూ మంచి నటన కనపర్చినా కథలో దమ్ము లేకపోవటంతో పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. దర్శకుడు విక్రమ్ కె కుమార్ గతంలో పలు మార్లు వచ్చిన పాత కథనే తీసుకుని అఖిల్ పై ప్రయోగం చేశాడని చెప్పొచ్చు. సినిమాలో అఖిల్ స్టంట్స్, పాటల్లో డ్యాన్స్ బాగున్నాయి. తొలి సినిమానే అయినా హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శిని తన వరకూ ఓకే అన్పించుకుంది. సినిమాలో కామెడీ ట్రాక్ ఎక్కడా లేదు. ఫస్టాఫ్ మరీ డల్ గా ముందుకు సాగుతుంది. సెకండాఫ్ కొంతలో కొంత పర్వాలేదన్పిస్తుంది. ఎన్నో ఆశలు పెట్టుకున్న రెండవ సినిమాతోనూ అఖిల్ ప్రేక్షకులను మరోసారి నిరాశపర్చాడనే చెప్పొచ్చు.

2.25/5

Next Story
Share it