Telugu Gateway
Telangana

హరీష్ రావు దేనికైనా రెడీ అవుతున్నారా?.

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)లో అత్యంత కీలకనేతగా ఉన్న సాగునీటి శాఖ మంత్రి హరీష్ రావు దేనికైనా రెడీ అవుతున్నారా?. అంటే అవుననే అంటున్నాయి ఆ పార్టీ వర్గాలు. అడుగు అడుగునా అవమానాలు ఎదురవుతున్నా ఆయన మౌనంగానే ముందుకు సాగుతున్నారు. టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ తనను బలవంతంగానో..ఏదో రకంగా పక్కన పెట్టే వరకూ అక్కడే ఉండి పోరాడాలని నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. హైదరాబాద్ లో అట్టహాసంగా చేయతలపెట్టిన ప్రపంచ తెలుగు మహాసభల విషయంలోనూ హరీష్ రావును పక్కకు తప్పించారు. తొలుత ఈ కార్యక్రమ పనుల్లో హరీష్ రావు చురుగ్గా పాల్గొన్నారు. మీడియాలో ఆయన హడావుడి కూడా కన్పించింది. కానీ సర్కారు అకస్మాత్తుగా మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది. అందులో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, కెటీఆర్, తుమ్మల నాగేశ్వరరావులకే చోటు కల్పించారు. హరీష్ రావుకు అందులో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. సీఎం కెసీఆర్ కరీంనగర్ జిల్లాలో చేపట్టిన ప్రాజెక్టుల సందర్శనలో హరీష్ రావు పాల్గొంటున్నా...ఆయన దూరం దూరంగా తిరుగుతున్నారే తప్ప..‘ప్రేమ్’లో పెద్దగా కన్పించటం లేదు.

కెసీఆర్ తనయుడు, మంత్రి కెటీఆర్ కు పార్టీలోనూ..ప్రభుత్వంలోనూ ప్రాధాన్యత రోజు రోజుకు పెరుగుతోంది. ఉదాహరణకు తాజాగా మహబూబ్ నగర్ జిల్లాలో కెటీఆర్ పర్యటన అంతా హంగామాగా సాగింది. అదే జిల్లాకు చెందిన వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఉన్నా కెటీఆర్ చేతుల మీదుగా వందల కోట్లతో చేపట్ట ప్రతిపాదించిన ఆస్పత్రి భవనాల శంకుస్థాపన జరిగింది. అదే సమయంలో పూర్తి అయిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలోనూ కెటీఆర్ పాల్గొన్నారు. కానీ హౌసింగ్ శాఖ మంత్రి అయిన ఇంద్రకరణ్ రెడ్డి ఎక్కడా ఆ కార్యక్రమంలో కన్పించరు. అంటే సంబంధిత శాఖ మంత్రులను పూర్తిగా విస్మరించి కెటీఆర్ అన్నీ తానై వ్యవహరిస్తున్న తీరు టీఆర్ఎస్ లో పెద్ద చర్చనీయాంశంగా మారుతోంది. కెటీఆర్ తనయుడు అనే ఒక్క అర్హత తప్ప..ఆయన ఏ రకంగా సీనియర్ నేత అవుతారు అని ఓ నేత వ్యాఖ్యానించారంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు.

తాజాగా ప్రధాని నరేంద్రమోడీ పర్యటనలో జరిగిన వ్యవహారం కూడా టీఆర్ఎస్ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. నగర ప్రధమ పౌరుడు అయిన బొంతు రామ్మోహన్ కు కనీసం ప్రధాని మోడీని విమానాశ్రయంలో స్వాగతించే కార్యక్రమంలోనూ చోటు దక్కలేదు. ప్రొటోకాల్ ప్రకారం ముందు మేయర్, తర్వాత గవర్నర్, మూడవ వ్యక్తిగా సీఎం ఉంటారు. కానీ మేయర్ ను తప్పించి..గవర్నర్, సీఎంలే మోడీకి స్వాగతం పలికిన విషయం తెలిసిందే. ఓ వైపు సీఎం కెసీఆర్ అసెంబ్లీలో మాట్లాడిన పలు సందర్భాల్లో కొత్త రాష్ట్రంలో అన్ని విలువల ప్రకారం..పద్దతిగా సాగాలని చెబుతూ...అంతా ఇష్టారాజ్యంగా చేయటం ఏమిటి? అనే చర్చలో టీఆర్ఎస్ లో సాగుతోంది. శాఖల సమీక్షలదీ అదే తంతు. మంత్రులు సచివాలయంలో ఉన్నా వాళ్ళకు తెలియకుండానే అధికారులు సీఎం దగ్గర సమీక్ష ఉన్న సంఘటనలు ఎన్నో. సీఎం పిలిస్తే అధికారులు పోవటం తప్పే మీ కాకపోయినా మంత్రుల కనీస సమాచారం కూడా ఇవ్వకపోవటంపైనే చర్చంతా సాగుతోంది. సీఎం స్వయంగా మంత్రులను సమీక్షల విషయంలో పక్కన పెడితే..అధికారులు కూడా మంత్రులకు విలువ ఎలా ఇస్తారని కొంత మంది ప్రశ్నిస్తున్నారు. రకరకాల కారణాల వల్ల ప్రస్తుతం అందరూ మౌనంగా ఉంటున్నారని..బుడగ పేలిన రోజు మాత్రం పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పటం కష్టం అని ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు.

Next Story
Share it