Telugu Gateway
Andhra Pradesh

గుజరాత్ ఫలితాలు.. చంద్రబాబుపై ఎఫెక్ట్

గుజరాత్ ఫలితాలు ఏపీపై ప్రభావం చూపిస్తాయా?. ఖచ్చితంగా అవుననే అంటున్నాయి బిజెపి వర్గాలు. గుజరాత్ లో బిజెపి సుదీర్ఘ కాలంగా అధికారంలో ఉండటంతోపాటు..జీఎస్టీ, నోట్ల రద్దు వంటి వ్యతిరేకతల కారణంగా మోడీ సొంత రాష్ట్రంలో ఆ పార్టీ పరాజయం పాలు అవుతుందని టీడీపీ శ్రేణులు అంచనా వేసుకున్నాయి. ఈ ఫలితాల తర్వాత చంద్రబాబు దూకుడు చూపిస్తూ బిజెపికి గుడ్ బై చెబుతారని అందరూ భావించారు. కానీ టీడీపీ పరిస్థితి అనుకున్నది ఒకటి..అయింది ఒక్కటి అన్న చందంగా తయారైంది. ఇన్ని వ్యతిరేకతలు ఉన్నా కూడా గుజరాత్ ను బిజెపి తిరిగి కైవసం చేసుకోవటం టీడీపీ శ్రేణులకు ఏమాత్రం మింగుడుపడటం లేదు. మోడీ తీరుపై సొంత పార్టీతోపాటు ఇతర మిత్రపక్షాల నేతలు కూడా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. కానీ ప్రజలు ఆయన పక్కన ఉన్నారనే కారణంతో అందరూ మౌనం దాలుస్తూ ..అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు. మిత్రపక్షంగా ఉన్న బిజెపి ఏపీకి సంబంధించి అత్యంత కీలకమైన ప్రత్యేక హోదా, రైల్వే జోన్ ల విషయంలో హ్యాండిచ్చినా టీడీపీ గట్టిగా మాట్లాడలేకపోతోంది. హోదాకు మంచి ప్యాకేజీ రూపంలో ఎన్నో సాయాలు చేస్తున్నారని చెబుతూ వచ్చిన చంద్రబాబు..తాజాగా ప్యాకేజీ సాయం కూడా అరకొరే ఉందని నిట్టూర్చారు.

ఈ మధ్యే కేంద్రం..ఏపీ సర్కార్ల మధ్య పోలవరం రగడ మొదలైంది. కేంద్రంతో సంబంధం లేకుండా ఏపీ సర్కారు కొత్తగా 1400 కోట్ల రూపాయల పనులకు టెండర్లు పిలవటం..కేంద్రం వీటికి బ్రేక్ లు వేయటంతో చంద్రబాబు తీవ్ర స్థాయిలో స్పందించారు. ఇలా చేస్తే దండం పెట్టి తప్పుకుంటామని సంచలన వ్యాఖ్యలు చేశారు. తర్వాత సర్దుకున్నారు. గుజరాత్ ఫలితాల తర్వాత బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఎవరు అడ్డగోలుగా అవినీతి చేస్తూ తమను దెబ్బతీయాలని చూస్తున్నారో తెలుసంటూ వ్యాఖ్యానించారు. అంతే కాదు..తాము సీట్ల కోసం దేబిరించే స్థితిలోఉండమని..శాసించే స్థితిలో ఉంటామని వ్యాఖ్యానించారు. ఓ వైపు వైసీపీని అవినీతి పార్టీ అంటూ తిడుతూ ఆ పార్టీ వాళ్లను తీసుకుని మీరు మంత్రులు చేస్తారా? అంటూ తీవ్ర స్వరంతో వ్యాఖ్యానించారు. ఏపీలో తాము అధికారంలోకి రావటానికి కృషి చేస్తామని..రాష్ట్రం కోసం కేంద్రం ఎంతో చేస్తుందని చెప్పుకొచ్చారు. ఈ పరిణామాలు చూస్తుంటే రాబోయే రోజుల్లో బిజెపి-టీడీపీ సంబంధాలు అంత సాఫీగా సాగే అవకాశం లేనట్లు కన్పిస్తోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తాజా ఫలితాలతో మోడీ తనకు ఇప్పట్లో తిరుగులేదని నిరూపించుకున్నారు. ఈ సమయంలో ఎవరైనా ఆయన ముందు తోకజాడిస్తే చూస్తూ ఊరుకుంటారా?. మోడీ గత చర్యలను గమనిస్తే అది అసాధ్యమే అని చెప్పుకోవచ్చు.

Next Story
Share it